ఏకపక్షంగా 205 పనులు రద్దు చేసిన సీఈఓ
కలెక్టర్ మాటనూ లెక్క చేయకుండా
● కలెక్టర్ ఆదేశాలు సైతం బేఖాతర్
● గత పాలకవర్గ సమావేశంలో
నిలదీసినా వెనక్కి తగ్గని వైనం
● అధికారిని వెనకుండి నడిపిస్తున్న
అధికార పార్టీ ప్రజాప్రతినిధులు
● సీఈఓ నిర్ణయంపై భగ్గుమంటున్న పాలక వర్గ సభ్యులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/మచిలీపట్నం: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన పనులను రద్దు చేస్తూ సీఈవో కన్నమనాయుడు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఆయన పాలక వర్గం నిర్ణయాలతో సంబంధం లేకుండా ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలపై పాలక వర్గ సభ్యులు భగ్గుమంటున్నారు. గత పాలక వర్గ సమావేశంలో పనుల రద్దు అంశంపైన సమావేశంలో గందరగోళం నెలకొంది. సీఈవో తీరును నిరసిస్తూ సభ్యులు నిరసన చేపట్టారు. కలెక్టర్ హామీతో సభ్యులు శాంతించారు. అయితే మరలా ఈ నెల 19వ తేదీన జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్‌సీ) జరగనుంది. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ సీఈవో కె. కన్నమనాయుడు తన మొండి వైఖరి విడనాడకుండా, సమావేశంలో ఆమోదించిన పనులను రద్దు చేశారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతి నిధులకు మంచి పేరు ఎక్కడ వస్తుందోనని ఆందోళన చెందుతున్న అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు తెర వెనుక ఉండి కథ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం జిల్లా పరిషత్ సీఈఓను పావుగా వాడుకొంటున్నారు. ఇందులో భాగంగానే జిల్లా పరిషత్ పాలకవర్గం ఆమోదించిన పనులకు నిధులు లేవంటూ సాకులు చూపుతూ రద్దు చేసి, ‘నేనింతే’ అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు సూచించిన పనులకు నిధులు వెచ్చిస్తున్నారు.
పాలకవర్గంపై అక్కసుతోనే..
జిల్లా పరిషత్ పాలకవర్గం ఆయా సభ్యులకు కేటాయించిన రూ.12.74కోట్లకు సంబంధించి 205 పనులు నిలిపివేస్తూ జెడ్పీ సీఈవో ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి చైర్‌పర్సన్‌కు లేఖ పంపినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నాయకులకు చెందిన పనులు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నప్పటికీ పాలకవర్గం వైఎస్సార్ సీపీది కావటంతో వారిపై అక్కసుతో కావాలనే ఈ రకంగా సీఈవో వ్యవహరిస్తున్నారని సభ్యులు వాపోతున్నారు. గత సర్వసభ్య సమావేశం ముందు రూ. 24.75 కోట్లకు చెందిన 424 పనులను రద్దు చేశారు. దీంతో సభ్యులు సమావేశంలో ఒక్కసారిగా సమావేశాన్ని స్తంభింపజేసి పనులను ఎందు కు నిలిపివేశారని ప్రశ్నల వర్షం కురిపించారు.
రద్దు చేసిన పనులు ఇవి..
నూజివీడు, ముసునూరు, చాట్రాయి, ఆగిరిపల్లి మండలాలకు ఎస్సీ, ఎస్టీ ప్రజలకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాళ్లు మంజూరు చేశారు. గుడ్లవల్లేరు, బంటుమిల్లి మండలాలకు శ్మశానవాటికలు లేవని, దహన సంస్కారాలకు చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఆయా పంచాయతీలోని ప్రజలు విన్నవించగా 25 పంచాయతీలకు టెండర్ ద్వారా పనులను చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయ్యింది. ఇబ్రహీంపట్నంలోని రూ.90 లక్షల విలువగల పనులకు శంకుస్థాపన సైతం చేసినట్లు గత జెడ్పీ సర్వసభ్య సమావేశం దృష్టికి జెడ్పీ వైస్ చైర్‌సర్సన్ శ్రీదేవి తెచ్చారు.
గత సర్వసభ్య సమావేశంలో పనుల రద్దు విషయంలో సభ్యులు చేసిన పోరాటానికి కలెక్టర్ డీకే బాలాజీ స్పందిస్తూ చైర్‌పర్సన్, సీఈవో, ఇంజినీరింగ్ అధికారులతో చర్చించి పనులు ఎంత వరకు వచ్చాయి? ఏ పనులు పూర్తయ్యాయి? అనే విషయాలను చర్చిస్తామని.. అనంతరం నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ హామీని సైతం తుంగలో తొక్కి ఏకపక్షంగా 205 పనులను సీఈఓ రద్దు చేయడంపై సభ్యులు మండిపడుతున్నారు. పనుల రద్దు సమయంలో కలెక్టర్ ఇచ్చిన హామీనీ ఓ అధికారి, సీఈఓ దృష్టికి తీసుకొని వస్తే, ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఉద్యోగుల్లో చర్చ సాగుతోంది. చైర్మన్, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం పెట్టకుండానే నిర్ణయం తీసుకోవడం ఆయన మొండి వైఖరికి అద్దం పడుతుందనే భావన పలువురిలో వ్యక్తం అవుతోంది.
ఏకపక్షంగా 205 పనులు రద్దు చేసిన సీఈఓ


