ఏసీబీ వలలో సాగునీటి ప్రాజెక్టు ఉద్యోగి
విజయవాడలీగల్: పోలవరం కుడి ప్రధాన కాలువ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయంలో ప్రింటింగ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న నగేష్‌బాబు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పోలవరం కుడి ప్రధాన కాలువ పనులకు సంబంధించి గుత్తేదారుకు ధ్రువీ కరణ పత్రం ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేశారు. విజయవాడకు చెందిన గుత్తేదారు నాగార్జున నుంచి రూ.15 వేలు లంచం డిమాండ్ చేయడంతో నాగార్జున ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. నాగార్జున ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వలపన్ని నగేష్‌బాబు తన కార్యాలయంలో లంచం మొత్తం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నగేష్‌బాబు నివాసం, కార్యాలయంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కారుణ్య నియామకంలో ఆపరేటర్‌గా ఉద్యోగంలో చేరిన నగేష్‌బాబు 2022 నుంచి అనేక అవినీతి ఆరోపణలున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
చిలకలపూడి(మచిలీపట్నం): ఖాతాదారునికి వడ్డీతో ఇన్సూరెన్స్ బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లించాలని వినియోగదారుల కమిషన్ అధ్యక్షుఢు చింతలపూడి కిషోర్‌కుమార్, సభ్యురాలు శ్రీలక్ష్మీరాయల సోమవారం తీర్పునిచ్చారు. మచిలీపట్నం గొడుగుపేటకు చెందిన డి.వెంకటనరసింహారావు ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో 2014లో తనకు, తన కుటుంబ సభ్యులకు కలిపి పాలసీ తీసుకుని ప్రీమియం చెల్లిస్తున్నారు. ఏప్రిల్ 2024లో నరసింహారావు గుండె సమస్యతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యి రూ.1,98,915 ఖర్చు చేశారు. క్లయిమ్ కోసం ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించగా మెడికల్ రికార్డులు పరిశీలించి రూ.1,12,026 లు మాత్రమే చెల్లించారు. బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లించాలని ఎన్నిసార్లు ఇన్సూరెన్స్ కంపెనీని అడిగినా ప్రయోజనం లేకపోవటంతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. కమిషన్ సభ్యులు పూర్వాపరాలను విచారించి ఖాతాదారుడు నరసింహారావుకు బ్యాలెన్స్ మొత్తం రూ.76,862 లు ఫిర్యాదు చేసిన రోజు నుంచి 9 శాతం వడ్డీతో చెల్లించాలని మానసిక వేదనకు రూ.5 వేలు, ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు తీర్పు వెలువడిన 30 రోజుల్లోగా చెల్లించాలని తీర్పు చెప్పారు.


