నాణ్యతలో రాజీ పడితే చర్యలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భవానీ దీక్ష విరమణల నిమిత్తం చేపట్టిన పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడితే ఉద్యోగులతో పాటు కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని ఈవో శీనానాయక్ హెచ్చరించారు. దీక్ష విరమణలను పురస్కరించుకుని చేపట్టిన పనులను ఆదివారం ఆలయ ఈవో, ట్రస్ట్ బోర్డు సభ్యులు పరిశీలించారు. క్యూలైన్లు, స్నానఘాట్లు, ప్రసాదం కౌంటర్లు, లడ్డూ పోటు, హోమగుండాలు, ఇరుముడి సమర్పించే కేంద్రాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావాలన్నారు. ఈవో వెంట ట్రస్ట్ బోర్డు సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు(బుల్లబ్బాయ్), రాఘవరాజు, దుర్గగుడి ఈఈ రాంబాబు, ఇతర ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలోని 20 పరీక్ష కేంద్రాల్లో నేషనల్ మీన్స్–కమ్–మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా నిర్వహించామని కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు తెలిపారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష కొనసాగిందన్నారు. అసిస్టెంట్ కమిషనర్ మచిలీపట్నంలోని 9 పరీక్ష కేంద్రాలను సందర్శించి పర్యవేక్షించగా, జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలో ముగ్గురు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు 20 కేంద్రాలను పరిశీలించినట్లు తెలిపారు. జిల్లాలో 4,040 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 3,758 మంది (93.02శాతం) హాజరయ్యారని తెలిపారు.


