
దుర్గగుడిలో రద్దీ సాధారణం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం రద్దీ సాదారణంగా కనిపించింది. తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, ఖడ్గమాలార్చన అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతించారు. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంనే రద్దీ సాధారణంగా ఉందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఉదయం 8 గంటల తర్వాత వర్షం కాసింత తగ్గుముఖం పట్టడం, ఆ తర్వాత సాధారణ వాతావరణ పరిస్ధితులు నెలకొనడంతో నగరంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. మధ్యాహ్నం 11 గంటల తర్వాత క్యూలైన్‌లో కాస్త రద్దీ కనిపించి భక్తులతో కిటకిటలాడాయి. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన నిమిత్తం అరగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో క్యూలైన్‌లో భక్తులు బారులు తీరి కనిపించారు. మహా నివేదన అనంతరం మధ్యాహ్నం 12–20 గంటలకు దర్శనాలు తిరిగి ప్రారంభం కాగా, మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆలయ ప్రాంగణంలో భక్తుల తాకిడి కనిపించింది.