
కానిస్టేబుళ్ల ఆత్మీయ సమ్మేళనం
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ కమిషనరేట్‌కు చెందిన 2004 కానిస్టేబుళ్ల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఆటోనగర్‌లోని ఓ హోటల్లో జరిగింది. 20 ఏళ్ల తర్వాత కలుసుకున్న వారు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ సమయంలో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వివిధ కారణాలతో మృతి చెందిన బ్యాచ్ సభ్యులకు నివాళులర్పించారు. ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు రావిశెట్టి సాంబశివరావు మాట్లాడుతూ ట్రైనింగ్‌లో తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. దైనందన జీవితంలో నిరంతరం ఒత్తిడితో ఉండే తాము తమ స్నేహాన్ని 20 ఏళ్ల తర్వాత గుర్తు చేసుకునేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అనంతరం ఆటపాటలతో గడిపారు. 2004 బ్యాచ్ కు చెందిన సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.