
కేసరపల్లిలో కేంద్ర బృందం పర్యటన
కేసరపల్లి(గన్నవరం): మండలంలోని కేసరపల్లి గ్రామాన్ని బుధవారం నేషనల్ ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో డెప్యూటీ డైరెక్టర్ అదితి అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం పర్యటించింది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్వర్ణ పంచా యతీ పోర్టల్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీల్లో స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ పద్ధతిలో పన్నుల వసూళ్ల గురించి రాష్ట్ర పంచాయతీరాజ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2021లో తమ పాలకవర్గం అధికారంలోకి వచ్చినప్పుడు రూ.45 లక్షలు ఉన్న గ్రామపంచాయతీ వార్షిక ఆదాయాన్ని ప్రస్తుతం రూ.2 కోట్లకు పెంచినట్లు సర్పంచి చేబ్రోలు లక్ష్మీమౌనిక తెలిపారు. పెరిగిన ఆదాయంలో గ్రామంలో పలు సీసీ రోడ్లు, డ్రెయిన్లు వంటి అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.
కాఫీ స్టాల్ పరిశీలన
అనంతరం ఈ బృందం దుర్గాపురం వద్ద గ్రామపంచాయతీ నిధులతో ఏర్పాటు చేసిన కుంభకోణం కాఫీ స్టాల్‌ను పరిశీలించింది. ఈ స్టాల్ ద్వారా నెలకు రూ.70 వేలు వరకు పంచాయతీకి ఆదాయం సమకూరనున్నట్లు ఇన్‌చార్జ్ ఈఓపీఆర్డీ రాజబాబు తెలిపారు.
పంచాయతీలు ఆదాయం పెంచుకోవాలి
అనంతరం అదితి అగర్వాల్ మీడియాతో మాట్లా డుతూ రాష్ట్రంలో గ్రామపంచాయతీల స్వయం సమృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు వచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా గ్రామపంచాయతీల ఆదాయం పెంచుకునేందుకు కాఫీ స్టాల్, క్రికెట్ నెట్ వంటివి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఉపసర్పంచ్ జాస్తి శ్రీధర్‌బాబు, ఎంపీటీసీ సభ్యులు శొంఠి కిషోర్, పంచాయతీరాజ్ అసిస్టెంట్ డైరెక్టర్లు చందన, హర్ష, చైతన్య, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.