
ఘనంగా విశ్వకర్మ జయంతి
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణాజిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) వి.వి.నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, ఇతర పోలీసు అధికా రులతో కలిసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశ్వకర్మ జయంతిని దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల ప్రజలు ఎంతో నిష్టతో జరుపుతారని, పశ్చిమ బెంగాల్లోని హల్దియా పారిశ్రామిక ప్రాంతం విశ్వకర్మ పూజకు ప్రసిద్ధి చెందిందని ఏఎస్పీలు తెలిపారు. ఇంజినీరింగ్ ఆర్కిటెక్చర్లే మాత్రమే కాకుండా వివిధ రకాల చేతి వృత్తుల వారు, హస్త కళాకారులు, మెకానిక్‌లు, వెల్డర్లు, పారిశ్రామిక కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులు, మొదలైన వారు కూడా ఎంతో నియమ నిష్టలతో జరుపుకుంటారని వివరించారు. పట్టుదల, నైపుణ్యాన్ని అలవర్చుకుంటే ఎంత కష్టమైనా పనినైనా తేలికగా సాధించవచ్చు అని తెలియచెప్పే విశ్వకర్మ అందరికీ ఆదర్శప్రాయుడని అడిషనల్ ఎస్పీలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సీఐలు, ఎస్‌ఐలు, కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.