
చెత్త సేకరణకు ప్రజలు సహకరించాలి
చల్లపల్లి: ఇంట్లో చెత్తను నిల్వ ఉంచుకోకుండా దానిని ఎప్పటికప్పుడు తడి, పొడి చెత్తలుగా వేరుచేసి పంచాయతీ వారికి అప్పగించటం ద్వారా ఇంటిని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటంతోపాటు ఆదాయ వనరుల్ని కూడా సృష్టించుకోవచ్చని కృష్ణా జిల్లా పంచాయతీ అధికారి జె. అరుణ పేర్కొన్నారు. స్థానిక తరిగోపుల ప్రాంగణంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం వద్ద మంగళవారం చెత్త సేకరణపై కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్(సీఆర్‌పీ)లకు ఒక్కరోజు శిక్షణ తరగతులను నిర్వహించారు. కృష్ణాజిల్లాలోని కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, గూడూరు, మచిలీపట్నం, ఘంటసాల, చల్లపల్లి ఏడు మండలాలకు చెందిన 65 మంది సీఆర్‌పీలు శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. పలు అంశాలపై సీఆర్‌పీలకు చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి పేర్ని మాధవేంద్రరావు, పెదకరగ్రహారం కార్యదర్శి కె.నరసింహారావులు శిక్షణ ఇచ్చారు. డివిజినల్ పంచాయతీ అధికారి ఎండీ రాజావుల్లా, ఇన్‌చార్జి ఎంపీడీవో అతావుల్లా, ఇన్‌చార్జి డెప్యూటీ ఎంపీడీవో సీహెచ్ ఉమామహేశ్వరరావు శిక్షణ తరగతులను పర్యవేక్షించారు.
కృష్ణా జిల్లా పంచాయతీ అధికారి అరుణ