
దసరా ఉత్సవాలకు దుర్గగుడి ముస్తాబు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఆలయం ముస్తాబవుతోంది. ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై అమ్మవారి, అయ్య వార్ల ఆలయాలను ఇప్పటికే రంగులతో అందంగా అలంకరించారు. దుర్గగుడి ప్రాంగణంలోని ఉపాలయాలు, ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న కారిడార్‌ను ముస్తాబు చేస్తున్నారు. గత ఏడాది దసరా ఉత్సవాలకు ఆలయానికి రంగులు వేయకపోవడంతో భక్తుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ఈ ఏడాది అమ్మవారి ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలను రంగులు వేస్తున్నారు.
ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన
ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న ఉత్సవ ఏర్పాట్లను ఈఓ శీనానాయక్ మంగళవారం పరిశీలించారు. తొలుత ఉత్సవాలకు విచ్చేసే ఇతర ఆలయాల సిబ్బందికి కేటాయించే వసతి గృహాలను తనిఖీచేశారు. సీతానగరంలోని దత్తత ఆలయంలో సిబ్బంది గదులు, భోజన వసతిపై ఆరా తీశారు. అనంతరం ఆలయానికి చేరుకుని లక్ష్మీగణపతి విగ్రహం వద్ద వివిధ ప్రభుత్వ శాఖలకు కేటా యించే పోడియాలు, టికెట్ స్కానింగ్ పాయింట్లు, మీడియా పాయింట్లు, చెప్పుల స్టాండ్, ఓం టర్నింగ్ నుంచి క్యూలైన్లను పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. వృద్ధుల కోసం బ్యాటరీ వాహనాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈఈ కోటేశ్వరరావు, రాంబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.