
దసరా ప్రత్యేక ఆర్జిత సేవా టికెట్లు విడుదల
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గమ్మ సన్నిధిలో నిర్వహించే ప్రత్యేక ఆర్జిత సేవా టికెట్లను ఆదివారం విడుదల చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఈవో చాంబర్‌లో ఆదివారం ఆలయ వైదిక కమిటీ, అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈవో శీనానాయక్ ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేశారు. అనంతరం ఈవో మాట్లాడుతూ ఈ టికెట్లను దేవస్థాన ఆర్జిత సేవా కౌంటర్, దేవస్థాన వైబ్‌సైట్‌తో పాటు ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఽదరలు ఇలా..
ప్రత్యేక ఖడ్గమాలార్చన టికెట్ రూ. 5,116, ప్రత్యేక కుంకుమార్చన టికెట్ రూ.3వేలు, మూలా నక్షత్రం రోజున రూ. 5వేలు, ప్రత్యేక శ్రీచక్రనవార్చన రూ.3వేలు, ప్రత్యేక చండీయాగం రూ.4వేలుగా నిర్ణయించామన్నారు. టికెట్లు కొనుగోలు చేసిన భక్తులను ప్రత్యేక క్యూలైన్ ద్వారా సేవలు జరిగే ప్రాంతానికి అనుమతిస్తామని తెలిపారు. సేవలో పాల్గొనే వారు ముందుగానే ఆయా వేదికల వద్దకు చేరుకోవాలని సూచించారు. భక్తులు ఉదయం 3.30 గంటల నుంచి 10–30 గంటల వరకు వన్‌టౌన్ గాంధీ మున్సిపల్ హైస్కూల్, భవానీఘాట్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి దేవస్థాన బస్సుల్లో కొండపైకి చేరుకోవాలని సూచించారు. వైదిక కమిటీ సభ్యులు కోటప్రసాద్, శ్రీధర్, శంకర శాండిల్య, ఏఈవోలు ఎన్.రమేష్‌బాబు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.