
ఆశల సాగుకు కడగండ్లు
ఏడాదైనా గండి పూడ్చలేదు
పులివాగు వరద ఉధృతికి చెక్‌డ్యామ్‌ల వద్ద భారీ గండ్లు
గండ్లు పూడ్చకపోవడంతో నీరు నిల్వ ఉండని వైనం
గండ్ల వల్ల కోతకు గురవుతున్న సాగు భూములు
గండి పూడిస్తేనే మేలు
త్వరలో పూడ్చేందుకు చర్యలు
జి.కొండూరు: పులివాగులో వరద ఉధృతికి చెక్ డ్యామ్‌ల వద్ద అంచులు కోతకు గురై గండ్లు పడ్డాయి. గండ్లను పూడ్చే దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు చేపట్టలేదు. వరద వచ్చినప్పుడల్లా అంచులు కొద్దికొద్దిగా కోతకు గురై సాగు భూములు పులివాగులో కలిసిపోతున్నాయి. చెక్‌డ్యాముల్లో నిల్వ ఉండాల్సిన నీరు దిగువకు వెళ్లిపోతోంది. చెక్‌డ్యామ్‌ల వల్ల రైతులకు మేలు జరగకపోగా వాటికి పడుతున్న గండ్లతో నష్టం వాటిల్లుతోందని రైతులు పేర్కొంటున్నారు. గండ్లు పడి ఏడాదైనా పూడ్చకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిర్మాణంలో లోపాలు
చెక్‌డ్యామ్‌ల నిర్మాణంలో లోపాలు ఉన్నాయంటూ ఇరిగేషన్‌శాఖ నిపుణులు చెబుతున్నారు. వాగు వెడల్పును బట్టి కాకుండా నిర్ణయించిన కొలతలతో డ్యామ్‌లను నిర్మించి అంచుల్లో మట్టి పోసి వదిలేయడం వల్లే తరుచూ గండ్లు పడుతున్నాయని పేర్కొంటున్నారు. పులివాగు ప్రారంభం నుంచి చివరి వరకు కూడా రెండు వైపులా వ్యవసాయ భూములు ఉన్న రైతులు ఆక్రమించి, పూడ్చి సాగు చేయడం వల్ల వాగు వెడల్పు తగ్గిపోయింది. దీంతో వాగులో వరద ఉధృతి పెరిగినప్పుడు చెక్‌డ్యామ్‌ల వద్ద నీటి ప్రవాహం దిశ మార్చుకొని ప్రవహించి అంచులు కోతకు గురవుతున్నాయని వివరిస్తున్నారు.
వాగులో కలిసిపోతున్న సాగు భూములు
చెక్‌డ్యామ్‌ల వద్ద అంచులు కోతకు గురై గండ్లు పడి నెలలు గడుస్తున్నా గండ్లను పూడ్చకపోవడంతో పక్కనే ఉన్న సాగు భూములు కోతకు గురవుతున్నాయి. అధికారులు ఈ గండ్లను అలానే వదిలేస్తే కొద్ది రోజులకి పక్కనే ఉన్న సాగు భూములు వాగులో కలిసిపోతాయని రైతులు ఆందోళన చెందు తున్నారు. చుక్కనీరు కూడా నిల్వకుండా కిందకు పోతోందని, చెక్‌డ్యామ్‌లు ఉండి కూడా ప్రయోజనం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేల ఎకరాలకు లబ్ధి
పులివాగులో వరద ప్రవాహాన్ని చెక్‌డ్యామ్‌లు, ఆనకట్టల ద్వారా నిల్వ చేయడం వల్ల సుమారు 3,500 ఎకరాలకు లబ్ధి చేకూరుతుందని అంచనా. పులి వాగుపై సున్నంపాడు గ్రామం వద్ద ఉన్న ఆనకట్ట నుంచి సప్లయ్ చానల్ ద్వారా మునగపాడు కొత్త చెరువుకు సరఫరా కావడం వల్ల 384 ఎకరాలు సాగువుతోంది. చెర్వుమాధవరం వద్ద ఆనకట్ట నుంచి సప్లయ్ చానల్ ద్వారా జి.కొండూరు పంట చెరువు, ఆత్కూరు ఊర చెరువులకు నీరు సరఫరా చేస్తే 718.80 ఎకరాలకు, పినపాక ఆనకట్ట నుంచి సప్లయ్ చానల్ ద్వారా పినపాక గంగాదేవి చెరువుకు నీరు సరఫరా చేస్తే 487.09 ఎకరాలు, నరసాయిగూడెం వద్ద ఉన్న ఆనకట్ట నుంచి సప్లయ్ చానల్ ద్వారా నరసాయిగూడెం కొత్తచెరువుకు నీరు మళ్లిస్తే 439.41 ఎకరాలకు మేలు జరుగు తంది. చెక్‌డ్యామ్‌ల పరిధిలో మోటార్లు, ఇంజిన్‌ల సాయంతో రైతులు 1500 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు.
గత ఏడాది ఆగస్టులో వచ్చిన వరదలకు మా పొలాల వద్ద చెక్‌డ్యామ్‌కు ఒకవైపు అంచు కోతకు గురై భారీ గండి పడింది. ఇప్పటి వరకు గండిని పూడ్చలేదు. ఆ గండి వల్ల వరద వచ్చినప్పుడల్లా సమీప పొలాలు కోతకు గురై వాగులో కలిసిపోతున్నాయి. చెక్‌డ్యామ్ వద్ద చుక్క నీరు నిల్వడంలేదు.
– కోన పాండురంగారావు(బుజ్జి),
రైతు, మునగపాడు గ్రామం
మా గ్రామం వద్ద పులివాగు చెక్‌డ్యామ్‌కు గండి పడింది. గండిని పూడ్చకపోవడం వల్లన వరద ప్రవాహం వచ్చినప్పుడు నీరంతా దిగువకు వెళ్లిపోతోంది. గండి పూడ్చితే చెక్‌డ్యామ్ వద్ద పూర్తిస్థాయిలో నీరు నిలిచి రైతులకు ఉపయోగపడుతుంది. చెక్ డ్యామ్‌లో నీరు నిలిస్తేనే ఈ ప్రాంతంలో భూగర్భజలాలు పెరుగుతాయి.
– ఉమ్మడి ప్రసాద్,
సర్పంచ్, తెల్లదేవరపాడు గ్రామం
పులివాగుపై చెర్వుమాధవరం, మునగపాడు, తెల్లదేవరపాడు వద్ద ఉన్న చెక్‌డ్యామ్‌కు పడిన గండ్లను ఇప్పటికే పరిశీలించాం. వాటి మరమ్మతులకు సంబంధించి ప్రాథమిక అంచనాలను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించాం. త్వరలో మరోసారి పరిశీలించి తుది అంచనాలు రూపొందిస్తాం. అనుమతి రాగానే గండ్ల మరమ్మతులు ప్రారంభిస్తాం.
– టి.రాజేష్,
ఇరిగేషన్ ఏఈఈ, జి.కొండూరు

ఆశల సాగుకు కడగండ్లు

ఆశల సాగుకు కడగండ్లు