
యువ న్యాయవాదులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
పెనమలూరు: న్యాయశాస్త్రం పూర్తి చేసి న్యాయవాద వృత్తిలో ప్రవేశించనున్న యువ న్యాయవాదులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకుని వృత్తిలో రాణించాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ప్రధాన కార్యదర్శి, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు చలసాని అజయ్‌కుమార్ అన్నారు. కానూరు వెలగపూడి దుర్గాంబ సిద్ధార్థ లా కాలేజీలో శనివారం ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ సహకారంతో విద్యార్థులకు ఏఐబీఈ మాక్‌టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో అడుగు పెట్టే వారికి నైపుణ్యం పెంపొందించటానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఏఐబీఈ మాక్ పరీక్ష నిర్వహించామన్నారు. పరీక్ష రాసిన విద్యార్థులు తమ ఫలితాలను విశ్లేషించుకుని నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మాక్‌టెస్ట్‌లో 273 మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ చెన్నుపాటి దివాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు.
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్
ప్రధాన కార్యదర్శి చలసాని అజయ్‌కుమార్