కృష్ణాజిల్లా ఎస్పీగా విద్యాసాగర్‌నాయుడు | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా ఎస్పీగా విద్యాసాగర్‌నాయుడు

Sep 14 2025 6:17 AM | Updated on Sep 14 2025 6:17 AM

కృష్ణ

కృష్ణాజిల్లా ఎస్పీగా విద్యాసాగర్‌నాయుడు

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): కృష్ణాజిల్లా కొత్త ఎస్పీగా వాసన విద్యాసాగర్‌ నాయుడును నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఎస్పీగా పనిచేస్తున్న ఆర్‌.గంగాధరరావును రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. విద్యాసాగర్‌ నాయుడు ప్రస్తుతం అన్నమయ్య జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎస్పీల బదిలీల్లో భాగంగా సాగర్‌నాయుడు జిల్లా ఎస్పీగా రానున్నారు. సాగర్‌నాయుడు 24 సంవత్సరాలకే సివిల్స్‌లో 101 ర్యాంకు సాధించి ఐపీఎస్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన స్వస్థలం భీమవరం. సాగర్‌నాయుడు ఎస్పీగా మరికొద్ది రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు.

దసరా ఉత్సవాల్లో పరోక్ష సేవా టికెట్ల విక్రయం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాల్లో అమ్మవారికి నిర్వహించే ప్రత్యేక ఆర్జిత సేవల్లో పరోక్షంగా పాల్గొనే భక్తులకు దుర్గగుడి టికెట్లను విక్రయిస్తుంది. అయితే ప్రత్యక్ష టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభిస్తారో ఆలయ అధికారులు తెలపకపోవడం గమనార్హం. ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాల్లో ప్రత్యేక ఖడ్గమాలార్చన, ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక చండీయాగం, ప్రత్యేక శ్రీచక్ర నవార్చన సేవల్లో పరోక్షంగా పాల్గొనేందుకు టికెట్లను విక్రయిస్తున్నారు. ఈ టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ఆన్‌లైన్‌ లింక్‌ ద్వారా సేవలు వీక్షించే అవకాశం కల్పిస్తారు. ఈ టికెట్లపై అమ్మవారి దర్శనానికి అనుమతించేది లేదని ఆలయ అధికారులు తేల్చి చెప్పేశారు. ఒక్కొక్క సేవలో పాల్గొనే వారు రూ.1500 చొప్పున, 11 రోజులకు రూ.11,116 చెల్లించాలని ప్రకటించారు.

లోక్‌అదాలత్‌ ద్వారా సత్వర పరిష్కారం

జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపీ

చిలకలపూడి(మచిలీపట్నం): జాతీయ లోక్‌అదాలత్‌ ద్వారా సత్వరమే కేసులు పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపీ సూచించారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాసదన్‌లో లోక్‌అదాలత్‌ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ రాజీపడదగిన అన్ని కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.వి.రామకృష్ణయ్య, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

16,599 కేసులు పరిష్కారం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లోని 42 బెంచ్‌లలో 16,599 కేసులను రాజీ ద్వారా పరిష్కరించారు. 15,111 క్రిమినల్‌ కేసులు, 169 సివిల్‌ కేసులు, 1001 చెక్‌ బౌన్స్‌లను పరిష్కరించగా, 100 మోటారు వాహన ప్రమాద క్లయిమ్‌లకు రూ.5.2 కోట్లు నష్టపరిహారంగా ఇచ్చేందుకు ఇన్సూరెన్స్‌ కంపెనీలు అంగీకరించాయని న్యాయమూర్తి గోపీ తెలిపారు. 218 ప్రీలిటిగేషన్‌ కేసులు పరిష్కరించి అవార్డులు జారీ చేశామన్నారు. మచిలీపట్నంలో కోర్టులో 2,527 కేసులు, విజయవాడ కోర్టుల్లో 7,321, గుడివాడలో 2,619, నందిగామ కోర్టు 494, నూజివీడు 446, మైలవరం 201, జగ్గయ్యపేట 245, బంటుమిల్లి 91, కై కలూరు 263, తిరువూరు 403, గన్నవరం 826, అవనిగడ్డ 435, మొవ్వ 456, ఉయ్యూరు కోర్టులో 272 కేసులను పరిష్కరించామని వివరించారు.

ఎన్టీఆర్‌ జిల్లాలో 20.11 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లాలో శనివారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి ఏడు గంటల మధ్య 20.11 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా విస్సన్నపేటలో 57.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా జి.కొండూరులో 44.1 మిల్లీమీటర్లు, రెడ్డిగూడెం 41.3, మైలవరం 31.0, ఇబ్రహీంపట్నం 30.0, ఎ.కొండూరు 27.8, తిరువూరు 25.3, గంపలగూడెం 22.6, వత్సవాయిలో 17.3 మిల్లీమీటర్ల వర్షం పడింది. విజయవాడ ఈస్ట్‌లో 14.5 మిల్లీమీటర్లు, వీరులపాడులో 14.0, విజయవాడ సెంట్రల్‌, వెస్ట్‌ 13.3, విజయవాడ రూరల్‌ 13.2, నందిగామ 9.5, పెనుగంచిప్రోలు 8.1, జగ్గయ్యపేట 6.3, చందర్లపాడు 5.6, కంచికచర్ల 4.8, విజయవాడ నార్త్‌లో 3.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

కృష్ణాజిల్లా ఎస్పీగా విద్యాసాగర్‌నాయుడు 1
1/2

కృష్ణాజిల్లా ఎస్పీగా విద్యాసాగర్‌నాయుడు

కృష్ణాజిల్లా ఎస్పీగా విద్యాసాగర్‌నాయుడు 2
2/2

కృష్ణాజిల్లా ఎస్పీగా విద్యాసాగర్‌నాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement