
పోర్టు పనులు మరింత వేగవంతం
ఆర్ అండ్ బీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): బందరు పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేసి 2026 అక్టోబర్ కల్లా రవాణా కార్యకలాపాలు ప్రారంభిస్తామని రాష్ట్ర రవాణా, రహదారులు భవనాల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. ఆయన అధికారులతో కలిసి పోర్టు నిర్మాణ ప్రాంతాన్ని, గిలకలదిండిలోని ఫిషింగ్ హార్బర్‌ను శనివారం సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. నార్త్, సౌత్ బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్, బెర్తులు, రహదారులు, పరిపాలన భవనాలు, గిడ్డంగుల నిర్మాణాలు తదితర పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏపీ మారిటైం బోర్డు సీఈఓ ప్రవీణ్ ఆదిత్యతో కలిసి పరిపాలన భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఇప్పటి వరకు జరిగిన పనులపై కృష్ణబాబు సమీక్షించారు. వర్కర్లు, యంత్రాలను పెంచి నిర్దేశించిన సమయానికి పోర్టు పనులను పూర్తిచేయాలని సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మచిలీపట్నం పోర్టుతో రెండు తెలుగు రాష్ట్రాల అవసరాలు తీరతాయన్నారు. మొత్తం 16 బెర్తుల్లో మొదటి దశలో నాలుగు పూర్తి చేసి కార్యకలాపాలను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రస్తుతం 50 శాతం మేర పనులు పూర్తయినట్లు తెలిపారు.
గిలకలదిండి పనుల పురోగతిపై ఆరా..
త్వరలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు కానున్న నేపథ్యంలో హైదరాబాద్ మార్గంతో పాటు పోర్టుకు సమీపంలోని జాతీయ రహదారులు, రైలు రవాణా మార్గాలను అభివృద్ధి చేయనున్నట్టు కృష్ణబాబు తెలిపారు. అందుకు సంబంధించిన డీపీఆర్‌లను (డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్) ఇప్పటికే సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఏపీ మారిటైం బోర్డు సీఈఓ ప్రవీణ్ ఆదిత్యతో కలిసి ఫిషింగ్ హార్బర్ నిర్మాణ ప్రణాళికకు సంబంధించిన మ్యాపులను పరిశీలించారు.
హార్బర్ పనులు నెమ్మదించాయని, ఈ నెలాఖరుకు పనుల్లో పురోగతి కనిపించకపోతే కాంట్రాక్ట్ రద్దు చేస్తామని కృష్ణబాబు హెచ్చరించారు. ఈ పర్యటనలో మెగా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ తులసీదాస్, జాయింట్ సీఎఫ్‌ఓ సతీష్, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈ రాఘవరావు, రైట్స్ టీం లీడర్ విశ్వనాథం, ఇన్‌చార్జి డీఆర్‌ఓ శ్రీదేవి, ఏపీ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ టీం లీడర్ చేతన్, ఆర్‌అండ్‌బీ ఈఈ లోకేష్, ప్రజా రవాణా అధికారి వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు నాగభూషణం, మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు.