
తాగునీటి కోసం రాస్తారోకో
కొమరవోలు(మొవ్వ): మూడు రోజులుగా తాగునీరు అందక అల్లాడుతున్నామంటూ ప్రజలు రోడ్డెక్కిన ఘటన పామర్రు మండల పరిధిలోని కొమరవోలు పంచా యతీ పరిధిలోని గాంధీ ఆశ్రమం వద్ద మంగళవారం చోటు చేసుకుంది. తమకు తాగునీరు రావడం లేదని అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. మూడురోజులుగా తాగునీరు లేని కారణంగా తాము రోడ్డు మీదకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గుడివాడ–పామర్రు జాతీయ రహదారిపై మండుటెండలో గ్రామస్తులు రాస్తారోకో చేశారు. దీంతో రహదారిపైన వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారనే సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి వచ్చారు. నీటి సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.