
డ్రోన్‌లతో నానో యూరియా పిచికారీ
జి.కొండూరు: డ్రోన్‌లతో నానో యూరియా పిచికారీ విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. జి.కొండూరు మన గ్రోమోర్ సెంటర్‌లో యూరియా పంపిణీని కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. యూరియా స్టాకు, పంపిణీ వంటి అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ శివారులో డ్రోన్‌తో నానో యూరియా పిచికారీని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 32 డ్రోన్‌లతో నానో యూరియా పిచికారీపై డెమో నిర్వహిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందన్నారు. రైతులు వ్యవసాయాధికారుల సూచనలతో అవసరం మేరకే యూరియాని వినియోగించాలన్నారు. కొరత లేకుండా ఉండేలా ఎరువుల పంపిణీపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ చాట్ల వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ రామకృష్ణనాయక్, ఏఓ సూరిబాబు, పలువురు రైతులు పాల్గొన్నారు.