
తీరని యూరియా కష్టాలు
అనిగండ్లపాడు(పెనుగంచిప్రోలు): యూరియా కష్టాలు అన్నదాతలను ఆవేదనకు గురిచేస్తున్నాయి. యూరియా కోసం మంగళవారం రైతులు రుకులు పరుగులు పెట్టారు. ప్రస్తుతం వరి పంటకు యూరియా ఎంతో అవసరం. అదును దాటితే ఎంత వేసినా ప్రయోజనం ఉండదు. దీంతో యూరియా కట్టల కోసం ఉదయం నుంచే సొసైటీల వద్ద పాస్‌పుస్తకం, ఆధార్ జిరాక్స్‌లు చేత పట్టుకుని రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. పనులు వదిలేసి యూరియా కోసం నిలబడితే ఒకటి లేదా రెండు బస్తాలు ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనిగండ్లపాడు సొసైటీలో 25 టన్నులు, పెనుగంచిప్రోలులో గ్రోమోర్‌లో 25 టన్నులు చొప్పున యూరియా పంపిణీ చేసినట్లు ఏవో రామసుబ్బారెడ్డి తెలిపారు. అయితే సొసైటీల వద్ద పంటలకు అవసరమైన మేర యూరియాను పంపిణీ చేయకపోవడంపై రైతులు పెదవి విరుస్తున్నారు.