
ఇబ్రహీంపట్నం: ఏపీ జెన్‌కో సంస్థ లోకల్ లారీ యజమానుల పొట్టకొట్టి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు బూడిద చెరువు అప్పజెప్పడం అన్యాయమని లోకల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మండిపడ్డారు. ఈ మేరకు కాంట్రాక్ట్ వ్యవస్థను అడ్డుకునేందుకు ప్రత్యేక కార్యాచరణకు మంగళవారం వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. లారీ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఆస్తులు అమ్ముకుని లారీలు కొనుగోలు చేశామన్నారు. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు బూడిద కాంట్రాక్ట్ కట్టబెట్టి తమకు అన్యాయం చేస్తే చూస్తూ సహించబోమని హెచ్చరించారు. ఉచిత బూడిదను అమ్మకానికి పెట్టి స్థానికుల పొట్టకొట్టొద్దన్నారు. ఏపీ జెన్‌కో, ఎన్టీటీపీఎస్ నిరంకుశ వైఖరిని ఖండించారు.
కంచికచర్ల: జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సి అవసరం లేదని, నానో యూరియాపై రైతులు అవగాహన కలిగి ఉండాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా అన్నారు. మంగళవారం కంచికచర్లలోని గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని చందర్లపాడు మండలం కోనాయిపాలెం ప్రాథ మిక సహకార పరపతి సంఘాన్ని పరిశీలించారు. ముందుగా ఎరువుల దుకాణానికి వచ్చిన రైతులతో జేసీ మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో 4,003 టన్నుల యూరియా అందు బాటులో ఉందని, మరికొంత యూరియా త్వరలో అందుబాటులోకి రానుందన్నారు. వరి నాటు వేసినప్పుడు ఎకరానికి 30 కేజీల యూరియా, నాటు వేసిన 30రోజులకు రెండో విడతగా మరో 30 కేజీలు, అంతేకాకుండా నాటు వేసిన మూడో విడత ఎకరానికి 30కేజీల యూరియాను వేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఏమైనా సందేహాలుంటే కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని జేసీ అన్నారు. తహసీల్దార్ సీహెచ్ నరసింహారావు, ఆర్‌ఐ వెంకటరెడ్డి, ఏఓ కె. విజయకుమార్, రైతులు పాల్గొన్నారు.
జగ్గయ్యపేట అర్బన్: ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం జగ్గయ్యపేటలో ఎన్నుకున్నారు. స్థానిక పోస్టాఫీసు ఎదురుగా ఉన్న సంఘ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంఘ అధ్యక్ష, కార్యదర్శులుగా షేక్ అబ్బాస్ ఆలీ, కొత్తపల్లి కోటేశ్వరరావు, కోశాధికారిగా కర్లపాటి కొండలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పరిశీలకుడు విష్ణువర్థన్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ వైద్యాధికారి నోముల అనిల్‌కుమార్‌ను సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం సంఘ సభ్యులకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
గన్నవరం: స్థానిక ఎన్టీఆర్ పశువైద్య కళాశాల ఆవరణలోని 3(ఏ) ఆర్‌అండ్‌వీ రెజిమెంట్ ఎన్‌సీసీ యూనిట్ ఆవరణలో మంగళవారం నిర్వహించిన హార్స్ షో ఆకట్టుకుంది. ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగే సమ్మిళిత వార్షిక శిక్షణ శిబిరంలో భాగంగా క్యాడెట్లు వివిధ విన్యాసాలను ప్రదర్శించారు. ఉదయం ఆక్టోపస్ పోలీస్‌ల ఆధ్వర్యంలో డాగ్ షో జరిగింది. స్నైపర్ డాగ్‌లు పేలుడు పదార్థాలను ఎలా గుర్తిస్తాయో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. సాయంత్రం హార్స్ షోలో భాగంగా ఎన్‌సీసీ క్యాడెట్లు గుర్రపు స్వారీ చేస్తూ అబ్బురపరిచే విన్యాసాలు ప్రదర్శించారు. అనంతరం ఉత్తమ ప్రదర్శన కనబరిచిన క్యాడెట్లకు ఎన్‌సీసీ కమాండెంట్ కల్నల్ విజయంత్ శ్రీవాస్తవ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. శ్రీవాస్తవ మాట్లాడుతూ ఈ శిక్షణ శిబిరానికి నాలుగు ఎన్‌సీసీ యూనిట్లకు చెందిన 260 మంది క్యాడెట్లు హాజరయ్యారని తెలిపారు. వారికి శారీరక దారుఢ్య, డ్రిల్, స్సోర్ట్స్ అండ్ గేమ్స్, ఫైరింగ్ ప్రాక్టీస్, వ్యక్తిత్వ వికాసం, ప్రథమ చికిత్స తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నామని వివరించారు. ఈ శిబిరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్యాడెట్లను న్యూఢిల్లీలో జరిగే రిపబ్లిక్ పరేడ్‌కు ఎంపిక చేస్తామన్నారు.