
కర్షకుడి కోసం కదంతొక్కిన వైఎస్సార్ సీపీ
యూరియా కొరత, ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై రైతన్నల కన్నెర్ర జిల్లాలోని మచిలీపట్నం, ఉయ్యూరు, గుడివాడల్లో ఆందోళనలు పోలీసులు అడ్డంకులు సృష్టించినా కొనసాగిన నిరసనలు ఆర్‌డీఓ కార్యాలయ అధికారులకు సమస్యలు విన్నవించిన వైఎస్సార్ సీపీ నేతలు, అన్నదాతలు
గుడివాడ ఆర్‌డీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన అన్నదాత పోరులో గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఆర్‌డీఓ కార్యాలయ ప్రాంగణంలోకి పార్టీ నేతలు, రైతులను వెళ్లనీయకుండా పోలీసులు తొలుత అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులు నేతల మధ్య వాగ్వాదం అనంతరం కొందరిని మాత్రమే లోనికి అనుమతించారు. కార్యాలయ అధికారులకు రైతులతో కలిసి నేతలు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ నేత దుక్కిపాటి శశిభూషణ్, రైతు సంఘం కన్వీనర్ పెన్నేరు ప్రభాకర్‌రావు, గుడివాడ, గన్నవరం జెడ్పీటీసీలు గోళ్ల రామకృష్ణ, అన్నవరపు ఎలిజిబెత్ రాణి, ఎస్సీ సెల్‌జిల్లా అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నందివాడ ఎంపీపీ పి.ఆదాం పలువురు రైతులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
కంకిపాడు: వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా వ్యాప్తంగా అన్నదాత పోరు విజయవంతం అయ్యింది. జిల్లాలోని మచిలీపట్నం, ఉయ్యూరు, గుడివాడ ఆర్‌డీఓ కార్యాలయాల వద్ద శాంతియుతంగా ఆందోళనలు నిర్వహించారు. ఎరువుల కొరత, బ్లాక్ మార్కెట్, పంట నష్టపరిహారం అందజేత తదితర అంశాలపై పార్టీ శ్రేణులతో కలిసి రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఆయా ఆర్‌డీఓ కార్యాలయాల వద్దకు పార్టీ శ్రేణులు, రైతులు పాదయాత్రగా వెళ్లకుండా పోలీసులు అడ్డుతగిలారు. అన్నదాతలు సైతం తమ గళం విప్పారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇబ్బందులు పడుతున్నామని, దిగుబడులుపై ఆందోళన చెందాల్సి వస్తోందని వాపోయారు.
యూరియా కొరత, ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై రైతులు కన్నెర్ర చేశారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కదంతొక్కారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన ‘అన్నదాత పోరు’లో తమ నిరసన గళం వినిపించారు. యూరియా అందించకుండా బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదంటూ ప్రభుత్వ పెద్దల తీరును ఎండగట్టారు. ప్రభుత్వ ఆదేశాలతో కార్యక్రమాన్ని పోలీసులు నీరుగార్చేందుకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. శాంతియుతంగా తమ సమస్యను విన్నవించుకునేందుకు సైతం ఆస్కారం లేదనేలా నిస్సిగ్గుగా వ్యవహరించారు. అయినా వైఎస్సార్ సీపీ మద్దతుతో రైతులు ఆర్‌డీఓ కార్యాలయాల వద్ద అధికారులకు వినతులు అందించి తమ సమస్యలను చెప్పుకున్నారు.

కర్షకుడి కోసం కదంతొక్కిన వైఎస్సార్ సీపీ