
రోగులకు మెరుగైన వైద్య సహాయం అందాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రోగులు ఎటువంటి ఇబ్బంది పడకుండా మెరుగైన వైద్య సహాయం అందించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం వైద్యాధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి శుక్రవారం జిల్లాలోని అన్ని చోట్ల ఉదయం 6 గంటలకే ఫ్రైడే డ్రైడే నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ అనుమానితుల నుంచి శ్యాంపిల్స్ తీసి రక్త పరీక్షలు నిర్వహించాలన్నారు. తాగునీటి శ్యాంపిల్స్ ఎప్పటి కప్పుడు పరీక్షించాలన్నారు.
చర్యలు తప్పవు..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, ఫిర్యాదు వస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జనన మరణ నివేదికలు, అదేవిధంగా ప్రసవాల నివేదిక ముఖ్యంగా నార్మల్, సిజేరియన్ నమోదు వివరాలు ప్రతిరోజు అందజేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని అత్యవసర మందుల నిల్వలు అందుబాటులో ఉండాలని, మందుల కొరత సమస్య ఉండరాదన్నారు. ఏఎన్‌ఎం నుంచి మెడికల్ ఆఫీసర్ వరకు అన్ని స్థాయిల్లోనూ అప్రమత్తత అవసరమని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాచర్ల సుహాసిని, డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ జె. ఇందుమతి, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ జె.సుమన్, డీఐఓ శరత్ కుమార్, డీసీహెచ్‌ఎస్ మాధవి దేవి పాల్గొన్నారు.