
వినాయక నిమజ్జనంలో కత్తులతో నృత్యాలు
వీరులపాడు: వినాయక నిమజ్జన కార్యక్రమంలో యువత మారణాయుధాలతో హల్‌చల్ చేయటంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు మండలంలోని నరసింహారావుపాలెం గ్రామంలో శుక్రవారం రాత్రి వినాయకుని నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో కొంతమంది యువత అత్యుత్సాహంతో పసుపు కండువాలు వేసుకుని డీజే సౌండ్స్, సినిమా పాటల మధ్య కత్తులు చేత పట్టుకుని నృత్యాలు చేయటంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. పోలీసులు అక్కడే ఉన్నా అడ్డుకునే యత్నం చేయకపోవటం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు అంటున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరా వృతం కాకుండా చూడాలని, భయానక వాతావరణాన్ని సృష్టించిన యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వ్యక్తిపై గాజు సీసాతో దాడి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): తన భార్యతో మాట్లాడుతున్నాడని ఓ వ్యక్తిపై గాజు సీసాతో దాడి చేసిన ఘటన భవానీపురం బ్యాంక్ సెంటర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యాధరపురం కామకోటినగర్‌కు చెందిన నాగోజు ఉదయసాయి భవానీ హాస్పిటల్‌లోని మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి షాపులో పనులు ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళుతున్నాడు. బ్యాంక్ సెంటర్ ఆక్స్‌ఫర్డ్ స్కూల్ సమీపంలోకి వెళ్లే సరికి వెనుక నుంచి రామకృష్ణ అనే వ్యక్తి గాజు సీసాతో ఉదయసాయిపై దాడి చేశాడు. తల, కుడి చేయి, వీపుపై గాజుతో పొడిచాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అక్కడికి సమీపంలో ఉన్న రామకృష్ణ సోదరుడు సాయి వచ్చి గొడవ పెద్దది చేశాడు. ఆ సమయంలో గాయపడిన ఉదయసాయిని స్నేహితులు భవానీ ఆసుపత్రికి, అక్కడ నుంచి ఆంధ్ర హాస్పిటల్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం న్యూ జీజీహెచ్‌కు తరలించారు. తనపై జరిగిన దాడి ఘటనపై ఉదయసాయి పోలీసులకు స్టేట్‌మెంట్ ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేశారు.