
అంతరాయాల్లేని విద్యుత్ సరఫరా ఇవ్వాలి
ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గించాలని ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో 33/11 కేవీ సబ్ స్టేషన్స్, సరఫరా లైన్లలో అంతరాయాలను తగ్గించాలన్నారు. ఇందుకోసం ముందుగానే నిర్వహణ పనులు, అవసరమైన సామగ్రి అందించేందుకు, అత్యవసర సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు పాడైపోయాయని, కరెంట్ పోయిందని ఫిర్యాదులొస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవన్నారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి విద్యుత్ శాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలని, వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సాగుదారులకు 9 గంటల నిరంతరంగా విద్యుత్ సరఫరా అందించాలన్నారు. పీఎం సూర్యఘర్ పథకం ప్రయోజనాలను వినియోగదారులకు వివరించాలన్నారు. సమావేశంలో డైరెక్టర్ టెక్నికల్ మురళీకృష్ణయాదవ్, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ కేవీఎస్‌ఎన్ మూర్తి, డైరెక్టర్ ఫైనాన్స్ ఎస్. వెంకటేశ్వర్లు ఆయా జిల్లాల విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
పక్కాగా రికార్డుల నిర్వహణ
కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు
కోనేరుసెంటర్: పోలీసు విభాగానికి సంబంధించిన రికార్డులను సిబ్బంది సమర్థంగా నిర్వహించాలని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డు బ్యూరో (డీసీఆర్‌బీ) విభాగాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఫైళ్ల నిర్వహణను పరిశీలించారు. సిబ్బంది పనితీరును గమనించారు. డీసీఆర్‌బీ విభాగంలో కేసులకు సంబంధించి ముఖ్యమైన ఫైళ్లను పరిశీలించి డిజిటల్ డేటా నిర్వహణపై ఆరా తీశారు. సెక్షన్‌లవారీగా నిర్వహిస్తున్న రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందికి అవసరమైన సలహాలు, సూచనలు చేశారు. ఇతర విభాగాలను సమన్వయం చేసుకుంటూ డేటాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. ఎస్‌ఐ పద్మ, శిరీష, సిబ్బంది పాల్గొన్నారు.
గుర్తు తెలియని వృద్ధుడు మృతి
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధు డిని స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కొత్తపేట సీఐ చిన్న కొండలరావు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట ఆంజనేయ వాగు సెంటర్‌లో సోమ వారం ఓ వృద్ధుడు స్పృహ కోల్పోయి ఉండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే 108లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వృద్ధుడు మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. మృతుడికి సుమారు 60 ఏళ్లు ఉంటాయని, ఒంటిపై బ్లూ షర్ట్ ధరించి ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు.

అంతరాయాల్లేని విద్యుత్ సరఫరా ఇవ్వాలి

అంతరాయాల్లేని విద్యుత్ సరఫరా ఇవ్వాలి