
ఆస్పత్రికెళ్తూ అనంతలోకాలకు..
హనుమాన్‌జంక్షన్ రూరల్: చైన్నె – కోల్‌కతా జాతీయ రహదారిపై హనుమాన్‌జంక్షన్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బావ, బావమరిది దుర్మరణం చెందారు. ఏలూరు జిల్లా దేవరపల్లి సమీపంలో పల్లంట్ల చెందిన పసలపూడి రాఘవ (30), ఆయన బావ, మేనమామ అయిన తాడేపల్లిగూడెం సమీపంలోని కృష్ణంపాలెంకు చెందిన ఎల్లిమెల్లి భాస్కరరావు (50)తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా దుర్ఘటన చోటు చేసుకుంది. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న బావ భాస్కరరావును విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం రాఘవ తీసుకెళ్తున్నారు. బైక్‌పై వెళ్తున్న రాఘవ, భాస్కరరావును హనుమాన్‌జంక్షన్ బైపాస్ రోడ్డులో శేరినరసన్నపాలెం క్రాస్ రోడ్డు దాటిన తర్వాత వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి వీరిని ఢీకొట్టింది. ఘటనలో తీవ్రగాయాలతో రక్తస్రావమైన ఇద్దరూ ఘటనాస్థలిలోనే మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న హనుమాన్‌జంక్షన్ ఎస్‌ఐ వి.సురేష్ ఘటనాస్థలికి చేరకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందటంతో ఆ కుటుంబ సభ్యుల ఆవేదన అరణ్యరోదనగా మారింది. బావను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు వచ్చిన బావమరిది కూడా ప్రమాదంలో దుర్మణం చెందడం ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఘటనపై కేసు నమోదు చేశారు.
లారీ ఢీకొని బావ, బావమరిది దుర్మరణం జంక్షన్ సమీపంలో ఘటన