
‘ఆడబిడ్డ నిధి’ అమలుకు ఆంధ్రాను అమ్మేయాలా?
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఏడాది పాలన తర్వాత పథకాల కోసం రాష్ట్రాన్ని అమ్మా లని చెబుతున్నారని, ఇప్పటికే సగం రాష్ట్రాన్ని చంద్రబాబు, లోకేష్ బినామీలకు అమ్మేశారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ విస్తృత ప్రచారం చేసి, వాటి అమలుకు తమ వద్ద రోడ్ మ్యాప్ ఉందన్న నేతలు నేడు సాకులు చెపుతున్నారని ఎద్దేవా చేశారు. అవినాష్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సంపద సృష్టించి మరీ హామీలు అమలు చేస్తామని చంద్రబాబు, పవన్ కల్యాణ్ చెప్పి, నేడు మాట మారుస్తున్నారన్నారు. సూపర్ సిక్స్ లోని ఆడబిడ్డ నిధి అమలు చేయలేమన్న సంకేతాలను మంత్రి అచ్చెన్నాయుడు ప్రజలకు మీడియా ద్వారా తెలియచేశారన్నారు. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మే యాలని చెబుతూ.. ఈ పథకాన్ని అమలు చేయలేమని చెప్పకనే చెప్పారన్నారు. సూపర్ సిక్స్‌లో భాగంగా ఆడబిడ్డ నిధి పేరుతో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తా మని చెప్పి అధికారంలోకి వచ్చారని, 13 నెలలు గడిచినా ఈ హామీని అమలు చేయకుండా వదిలేశారన్నారు. ఈ ఒక్క పథకం ద్వారానే కూటమి ప్రభుత్వం ఏకంగా రెండు కోట్ల మంది మహిళలను దారుణంగా మోసం చేశారన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి వంటి హామీలు ఏడాది గడిచినా ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. మూడు గ్యాస్ సిలిండర్ల హామీని ఒక్క సిలిండర్‌కే పరిమితం చేశారని ఇంకా మ్యానిఫెస్టోలో ప్రకటించిన 143 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు.
వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ హామీలు అమలు చేయలేమని చెప్పకనే చెప్పారు ఇప్పటికే సగం రాష్ట్రాన్ని బాబు, లోకేష్ బినామీలకు అమ్మేశారు