
మునిసిపల్ కార్మికుల సమ్మె వాయిదా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మునిసిపల్ ఇంజినీరింగ్ కార్మికులు చేపట్టిన సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు తెలిపారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం పాక్షికంగా జీతాలు పెంచిందన్నారు. కొన్ని అవకాశవాద సంఘాలు ప్రభుత్వానికి తొత్తులుగా మారి డిమాండ్లు సాధించే వరకు పోరాటం చేయని కారణంగా పాక్షిక విజయం మాత్రమే సాధ్యమైందన్నారు. పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా, 28 రోజులుగా విజయవాడలో డిమాండ్ల పరిష్కారం కోసం సమరశీలంగా పోరాడిన మునిసిపల్ ఇంజినీరింగ్, పారిశుద్ధ్య కార్మికులకు ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లో కార్మికుల ప్రయోజనాలు కాపాడేందుకు సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘ కోశాధికారి ఎస్.జ్యోతి బసు, రాష్ట్ర నాయకులు టి.తిరుపతమ్మ, టి.చిన్న, జె.విజయలక్ష్మి, జె.నాగరాజు, నల్ల శ్రీను, కృష్ణవేణి, పద్మ, దుర్గాప్రసాద్, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.