
యూరియా కొరత.. సాగుకు వెత
తోట్లవల్లూరు/బంటుమిల్లి: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు పనులు ఊపందుకున్నాయి. అయితే యూరియా కొరత రైతులను వేధిస్తోంది. వ్యవసాయావసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా లేదు. దీంతో రైతులు సొసైటీల వద్ద క్యూ కట్టాల్సిన పరిస్ధితి దాపురించింది. తోట్లవల్లూరు మండలంలో లంక గ్రామమైన పాముల లంకను మినహాయిస్తే మిగిలిన 15 గ్రామాల్లో సుమారు ఎనిమిది వేల ఎకరాల్లో వరి సాగవుతోంది. 20 రోజులుగా వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో వరినాట్లు దాదాపుగా పూర్తికాగా మరికొన్ని గ్రామాల్లో తుది దశలో ఉన్నాయి. బంటుమిల్లి మండలంలో ఏటా ఖరీఫ్‌లో 11 వేల ఎకరాల్లో వరి సాగవుతుంది.
సొసైటీల వద్ద రైతుల పడిగాపులు
ఖరీఫ్ అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా జరగటం లేదనే ఆరోపణలు రైతుల నుంచి వినవస్తున్నాయి. యూరియా కోసం పీఏసీఎస్‌ల వద్ద గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు. తోట్లవల్లూరు మండలంలోని నార్తువల్లూరు పీఏసీఎస్ వద్ద రైతులు ఉదయాన్నే సొసైటీకి చేరుకుని క్యూలో నిలబడటం చూస్తే యూరియా కొరత ఎంత ఉందో అర్థమవుతోంది. ఒక్కో రైతుకు కేవలం రెండు బస్తాల యూరియా మాత్రమే ఇస్తుండటంతో అవసరాలు తీరటం లేదు. దీంతో మళ్లీ బయటి వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంటుమిల్లి మండలంలోని బంటుమిల్లి, కంచడం, బర్రిపాడు సొసైటీల్లో ఎకరాల లెక్కన ఆధార్, పాస్ పుస్తకం చూపిస్తే ఎకరాకు ఒకటి, రెండు కట్టల యూరియా మాత్రమే ఇస్తున్నారు. ఈ యూరియా చాలదని రైతులు ఎరువుల దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. దీనిని అవకాశంగా తీసుకున్న వ్యాపారులు గుళికలు కొంటేనే యూరియా ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కొంత మంది ఎరువుల వ్యాపారులు కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియాను ప్రభుత్వ ధరకు ఇస్తామని స్పష్టంచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రాథమిక సహకార సొసైటీల్లో 45 కిలోల యూరియా బస్తా ధర రూ.265 మాత్రమే. 50 కిలోల డీఏపీ ధర రూ.1,350. వ్యాపారుల వద్ద డిమాండ్‌ను బట్టి యూరియా బస్తా రూ.350, డీఏపీ బస్తా రూ.1400లకు చెల్లించాల్సి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు.
అధికారులు పర్యవేక్షించాలి..
వర్షాలు ఆశాజనకంగా కురుస్తుండటంతో తోట్ల వల్లూరు మండలంలోని లంకల్లోని వాణిజ్యపంటలు, వరి పొలాల ఎదుగుదలకు రైతులు ప్రస్తుత దశలో యూరియా, డీఏపీ ఎక్కువగా వినియోగిస్తారు. ఈ రెండు ఎరువులకు డిమాండ్ పెరిగి కొరత ఏర్పడటంతో రైతుల అవసరాలకు సరిపడా అందటం లేదు. దీంతో రైతులు బయట వ్యాపారుల వద్ద ఎక్కువ ధరలకు ఎరువులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి సొసైటీలపై దృష్టి సారించాలని, వ్యవసాయావసరాలకు అనుగుణంగా యూరియా, డీఏపీ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రైతుల సేవల కోసం ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాలు(ఆర్‌ఎస్‌కే) అలంకారప్రాయంగా మిగిలాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల్లో పుష్కలంగా ఎరువులు అందుబాటులో ఉండేవి. కూటమి పాలనలో ఎరువుల కోసం తిప్పలు తప్పడంలేదని రైతులు వాపోతున్నారు.
ఎరువుల కోసం సొసైటీల వద్ద రైతుల క్యూ ఎకరాకు ఒకటి రెండు కట్టలే ఇస్తున్న వైనం యూరియా కట్టకుమార్కెట్లో రూ.350 వరకు వసూలు
బ్లాక్‌లో విక్రయిస్తే చర్యలు
మార్కెట్లో యూరియా కొరత లేదు. బంటుమిల్లి మండలంలో 80 టన్నుల స్టాకు ఉంది. యూరియాను ఇతర ఎరువులు, పురుగు మందులతో కలిపి విక్రయించినా, అధిక ధర వసూలు చేసినా చర్యలు తప్పవు. మండలంలోని మూడు సొసైటీల వద్ద యూరియా స్టాకు ఉంది. యూరియా వాడకం తగ్గించడం కోసమే ఎకరానికి అర బస్తా చొప్పునే ఇవ్వాలన్న నిబంధన విధించాం. ఎరువులకు సంబంధించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలి.
– ఎన్.రమాదేవీ, ఏడీఏ, బంటుమిల్లి