
ఉద్యోగుల కరువు భత్యం ప్రకటించాలి
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఉద్యోగుల కరువుభత్యం, మధ్యంతర భృతిని తక్షణం ప్రభుత్వం ప్రకటించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఎ.సుందరయ్య డిమాండ్ చేశారు. సమఖ్య జిల్లా కార్యవర్గ సమావేశం విజయవాడలోని సంఘ కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా సుందరయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ కమిటీకి సంబంధించి వెంటనే కమిషన్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ లోపు 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాలు, సరేండర్ లీవ్ బకాయిలను తక్షణం చెల్లించాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు పాఠశాలల్లో విలువైన సమయాన్ని బోధనకు కేటాయిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. సెక్రటరీ జనరల్ డాక్టర్ ఇంటి రాజు మాట్లాడుతూ.. జిల్లాలో మండల విద్యాశాఖ అధికారులు వారంలో కనీసం ఒక రోజు మండలంలో అందుబాటులో ఉండి ఉపాధ్యాయుల సర్వీస్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు బేగ్, వి.రాధిక, వెంకటనారాయణ, ఎండీ ఆష్‌హర్, పూర్ణచంద్రరావు, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.