
పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై దృష్టి పెట్టండి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యాశాఖ అధికారులను, ప్రధానోపాధ్యాయులను కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. సోమవారం రాత్రి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుపై ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, రిసోర్స్‌పర్సన్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించి క్లస్టర్ల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 141 పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఒక్క విద్యార్థి కూడా చేరకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఒక్కొక్క మోడల్ ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులకు పైగా ఉండాలని, 30 నుంచి 60 మంది మాత్రమే ఉంటున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు తరగతులు మారుతున్నప్పుడు కింది తరగతిలో ఉన్న వారు పై తరగతుల్లో ఎందుకు చేరటం లేదన్న కారణాలను విశ్లేషించాలన్నారు. జూన్ నెల ముగిసినా, అందరూ కలిసికట్టుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య ముమ్మరంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల నమోదు లేకుంటే ఆ పాఠశాలలు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. మంగళవారం ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి విద్యార్థుల నమోదు పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యా యులు తమ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కార్యకర్తలతో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో డీఈఓ పి.వి.జె.రామారావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ బాలాజీ