
లోకపావని.. శాకంబరి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): లోకపావని.. జగజ్జనని కనకదుర్గమ్మ శాకంబరిమాతగా భక్తులను కరుణించనున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభం కానున్నాయి. అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు మల్లేశ్వర స్వామి ఆలయం, ఇతర ఉపాలయాలను, దేవతా మూర్తులను ఆకుకూరలు, కాయగూరలతో విశేషంగా అలంకరిస్తున్నారు. అమ్మవారిని అలంకరించేందుకు అవసరమైన పండ్లు, కాయగూరలు, ఆకుకూరలను దండలుగా సేవా సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే శాకంబరీ ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఉత్సవాల నిర్వహణ కోసం కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నుంచి సుమారు 20 టన్నులకు పైగా కూరగాయలు, ఆకుకూరలను దాతలు సమర్పించారు. నగరంలోని హోల్‌సేల్ కూరగాయల వ్యాపారులు, పండ్ల వ్యాపారులు తమ వంతుగా ఉత్సవాల్లో భాగస్వాములవుతున్నారు. శాకంబరిగా దుర్గమ్మను దర్శించుకున్న భక్తులకు కదంబ ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు.
గణపతి పూజతో ఉత్సవాలకు శ్రీకారం
మంగళవారం ఉదయం 8 గంటలకు విఘ్నేశ్వర పూజ, ఋత్విక్‌వరుణ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధనతో శాకంబరి ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. సాయంత్రం నాలుగు గంటలకు కలశస్థాపన, అగ్నిప్రతిష్టాపన, మండపారాధన వంటి వైదిక కార్యక్రమాలు జరుగుతాయి. పదో తేదీ ఉదయం పది గంటలకు పూర్ణాహుతితో ఉత్సవాలు లాంఛనంగా ముగుస్తాయి. శాకంబరీ ఉత్సవాలు జరిగే మూడు రోజులూ ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అంతరాలయ దర్శనం రద్దు చేసినట్లు ఆలయ ఈఓ శీనానాయక్ తెలిపారు. అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించే భక్త బృందాల సంఖ్య రోజు రోజుకూ గణనీయంగా పెరుగుతుండటం, శాకంబరీ ఉత్సవాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
శాకంబరీ అలంకరణ పనులు
శాకంబరీ ఉత్సవాల నేపథ్యంలో ఆలయంతో పాటు అమ్మవారి ఆలయ అలంకరణకు అవసరమైన కూరగాయల దండలను మహామండపం ఆరో అంతస్తులో సిద్ధం చేస్తున్నారు. సోమవారం ఉదయం ఈఓ శీనానాయక్ కూరగాయలు, కాయగూరలు, ఆకుకూరలకు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. రెండు వందల మంది సేవా సిబ్బంది ఈ కూరగాయల దండలను సిద్ధం చేస్తున్నారు.
నేడు శాకంబరిగా కనకదుర్గమ్మ దర్శనం
ప్రధాన ఆలయాలు, ఉపాలయాలకు కూరగాయలతో అలంకరణ
మూడు రోజుల పాటు కొనసాగనున్న శాకంబరి ఉత్సవాలు
ఉత్సవాల్లో ప్రత్యేకంగా కదంబ ప్రసాదం

లోకపావని.. శాకంబరి