
అర్జీల పరిష్కారంలో శ్రద్ధ చూపండి
● జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావు ● పీజీఆర్‌ఎస్‌లో 219 అర్జీల స్వీకరణ
చిలకలపూడి(మచిలీపట్నం): అర్జీల పరిష్కారంలో అధికారులు శ్రద్ధ చూపాలని అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమ వారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం జరిగింది. డీఆర్వోతో పాటు అసిస్టెంట్ కలెక్టర్ జాహిద్ ఫర్హీన్, ఏఎస్పీ సత్య నారాయణ, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, విజిలెన్స్ డెప్యూటీ కలెక్టర్ పోతురాజు, బందరు ఆర్డీఓ కె.స్వాతి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం డీఆర్వో చంద్రశేఖరరావు మాట్లాడుతూ.. జిల్లాల నలుమూలల నుంచి ప్రజలు వచ్చి అర్జీలు ఇస్తున్నారని, వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు స్పష్టంచేశారు. అర్జీలు రీ–ఓపెన్ కాకుండా సంబంధిత అర్జీదారులకు సరైన సమాధానం చెప్పాలన్నారు. వివిధ శాఖల అధికారులు ఆయా శాఖకు సంబంధించి కోర్టు కేసులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 219 అర్జీలను స్వీకరించారు. తన భర్త షేక్ కాలేషా ప్రభుత్వ ఉద్యోగి అని, 2005 మార్చి 31వ తేదీన ఉద్యోగ విరమణ చేశారని ఇంత వరకు పెన్షన్, గ్రాడ్యుయిటీ, ఇతర బెనిఫిట్లు ఇవ్వలేదని ఆగిరిపల్లికి చెందిన వృద్ధురాలు రమీమున్నీసా అర్జీ అందజేశారు. కాలేషా 2024 ఫిబ్ర వరి 25వ తేదీన అనారోగ్యంతో మృతి చెందారని, రిటైర్మెంట్ బెనిఫిట్లు చెల్లించాలని, తనకు పింఛన్ మంజూరు చేయాలని వేడుకున్నారు.