కొండ ప్రాంతాలు..
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ‘అమ్మ..’ అన్న పిలుపు కోసం మహిళలు ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. వివాహం జరిగి సంవత్సరాలు గడిచినా పిల్లలు పుట్టని వారు ఇష్టదైవాలకు మొక్కుకుంటారు. మాతృత్వ మాధుర్యం కోసం ఎంతగానో పరితపిస్తారు. అయితే ఇటీవల విజయవాడ కొత్తపేట పరిధిలో చోటు చేసుకున్న ఘటనలు మాతృత్వానికి మాయని మచ్చగా నిలిచాయి. నెలన్నర క్రితం నెలలు నిండని చిన్నారి మృతదేహాన్ని నడిరోడ్డుపై పడేశారు. ఆ ఘటనను మరువక ముందే మరో శిశువును జీవించి ఉండగానే రోడ్డు పక్కన పడేశారు. ఒకే ప్రాంతంలో నెలన్నర వ్యవధిలో రెండు ఘటనలు జరగడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ డ్రెయిన్లు, నిర్మానుష్య ప్రాంతాల్లో అప్పుడే పుట్టిన శిశువులను వదిలేసిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
45 రోజుల్లో రెండు ఘటనలు
మే 28వ తేదీ రాత్రి రెండు గంటల సమయంలో కొత్తపేట కొండ ప్రాంతంలోని సింహాద్రి వీధిలో నడిరోడ్డుపై నెలలు నిండని పసిగుడ్డు మృతదేహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు పడేశారు. నెలలు నిండని మగ శిశువుకు కనీసం బొడ్డు తాడు కూడా కోయలేదు. పసికందు పరిస్థితిని చూసి స్థానికుల కళ్లు చెమర్చాయి. రెవెన్యూ అధికారి ఫిర్యాదు అనంతరం మృత శిశువును ఖననం చేశారు. తాజాగా ఈ నెల రెండో తేదీ అర్ధరాత్రి వేళ పోతిన సాయిప్రసాద్ వీధిలో బిడ్డ గుక్కపెట్టి ఏడవడం స్థానికులకు వినిపించింది. ఆ ఏడుపు ఎంతకూ ఆగకపోవడంతో సగురుపిళ్ల సోమరాజు కుటుంబం బయటకు వచ్చి గాలించగా చిమ్మ చీకటిలో రోడ్డు పక్కగా అప్పుడే పుట్టిన మగ బిడ్డ కనిపించింది. చీకటిలో ఎలుకలు కోరుకుతుండటంతో ఎవరో వదిలేసిన ఆ పసిగుడ్డు గుక్కపెట్టి ఏడ్వడాన్ని గుర్తించి సోమరాజు కుటుంబ సభ్యులు అక్కున చేరుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఆ బిడ్డను ప్రభుత్వాస్పత్రిలో చేర్చించి వైద్యం చేయించారు.
కొండప్రాంతాల్లో అబార్షన్లు?
నగరంలోని పలు ప్రయివేటు ఆస్పత్రులు, హెల్త్ సెంటర్లలో విధులు నిర్వహిస్తున్న కొంత మంది సిబ్బంది తమ ఇంటి వద్ద అశాసీ్త్రయ పద్ధతిలో అబార్షన్లు, కాన్పులు చేస్తున్నట్లు కొండ ప్రాంతాల్లో ప్రచారం జరుగుతోంది. తెలిసీ తెలియక చేసిన తప్పులతో గర్భందాల్చుతున్న యువతులను కొండ ప్రాంతాల్లోని ఇళ్లలో అద్దెకు దింపి అక్కడే గట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు చేస్తున్నారని తెలుస్తోంది. అబార్షన్ చేసే క్రమంలో అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప ఇటు వంటి తప్పులు బయట పడే అవకాశం లేదంటున్నారు.
రోడ్ల పక్క, డ్రెయిన్‌లో అప్పుడే పుట్టిన శిశువులు బెజవాడ కొత్తపేటలో నెలన్నరలో రెండు ఘటనలు
దృష్టి పెడితే
సమస్యకు పరిష్కారం
కొత్తపేట, మహంతిపురం, వించిపేట, గొల్లపాలెం గట్టు, ప్రైజర్‌పేట, కేఎల్‌రావునగర్, లంబాడీపేట, చిట్టినగర్ పరిధిలో కొండ ప్రాంతాల్లో తరుచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటు న్నాయి. ఈ ఘటనపై స్థానికులు, వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారే తప్ప బాధ్యలెవరనేది రుజువు కావడం లేదు. యువతి గర్భం దాల్చినప్పటి నుంచి ప్రతి నెలా తమ ఇంటి సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రంలో నమోదు చేసు కుని పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంది. లేదా సమీపంలోని ఆస్పత్రిలో వైద్యం తప్పక పొందుతారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు జిల్లా స్థాయి అధికారులు ముందుకొచ్చి ఘటన జరిగిన ప్రాంతంలోని అంగన్‌వాడీ సిబ్బందితో స్థానికంగా విచారణ జరిపిస్తే తప్పక ఫలితం ఉంటుందంటున్నారు. ప్రతి నెలా వచ్చే గర్భిణులు, డెలివరీ అయిన వారి వివరాలను సరి చూసుకోవడం ద్వారా ఈ బిడ్డల వివరాలు తెలిసే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు. ఒక వేళ కనికరం లేకుండా బిడ్డలను కని రోడ్డున పడేసే తల్లులను గుర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొత్తపేట వాసులు కోరుతున్నారు.
అమ్మానుషానికి షెల్టర్ జోన్లు!