
అర్జీలను సత్వరమే పరిష్కరించండి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఏఎస్పీ సత్యనారాయణ, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఆర్డీవో ఎ.స్వాతి, విజిలెన్స్ డెప్యూటీ కలెక్టర్ పోతురాజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ దివ్యాంగుల వద్దకు నేరుగా వెళ్లి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకుని పరిష్కారానికి భరోసా ఇచ్చారు. పెడన పట్టణానికి చెందిన దివ్యాంగురాలు పడమట పద్మ వద్దకు కలెక్టర్ వచ్చి ఆమె సమస్యను అడిగి తెలుసుకున్నారు. తనకు ఎలాంటి వాహనం లేదని బ్యాటరీ స్కూటరు అందజేయాలని కోరారు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని వికలాంగుల సంక్షేమశాఖ ఏడీకి సూచించారు. గుడివాడకు చెందిన దివ్యాంగుడు కొడాలి పోతురాజుకు ముఖ్యమంత్రి పర్యటనలో ఇచ్చిన హామీ ప్రకారం మూడు చక్రాల స్కూటీని కలెక్టర్ అందజేశారు. తోట్లవల్లూరుకు చెందిన దివ్యాంగురాలు పెద అమ్మాజీ తన మేనకోడలు శివలక్ష్మి మోసం చేసి 25 సెంట్ల స్థలాన్ని తన వద్ద నుంచి రాయించుకున్నారని కలెక్టర్‌కు మొరపెట్టుకోగా, ఆయన స్పందిస్తూ న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయసహాయం అందిస్తారని, అక్కడకు వెళ్లాలని సూచించారు. మీకోసంలో మొత్తం 194 అర్జీలను అధికారులు స్వీకరించారు.
జాబ్‌మేళా పోస్టర్ ఆవిష్కరణ
ఈ నెల 16న మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోని నేషనల్ కళాశాలలో నిర్వహిస్తున్న మెగా జాబ్‌మేళాపై రూపొందించిన వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ డీకే బాలాజీ, ఇతర అధికారులు ఆవిష్కరించారు.
ప్రధానమైన అర్జీలు ఇవే...
● పమిడిముక్కల మండలం గురజాడ గ్రామంలో సర్వే నంబరు 124/1 లో గతంలో ఎడ్లబండ్లు, రైతుల రాకపోకలకు రహదారి ఉండేదని రైతులు సుమారుగా 200 ఎకరాలకు వెళ్లే దారిగా ఉపయోగించుకునే వారని, అయితే గ్రామ సర్పంచ్ కుమారుడు ఎస్సీల శ్మశానభూమి అంటూ రాకపోకలకు వీలు లేకుండా సిమెంటు స్తంభాలు పాతి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు.
● తోట్లవల్లూరు మండలం కుమ్మమూరు గ్రామానికి చెందిన బొప్పన గోపాలకృష్ణ గ్రామంలో 1500 మంది నివసిస్తున్నారని తూర్పువైపున డ్రైనేజీ కోడు పూర్తిగా ఆక్రమణకు గురై పూడిపోయిందని, అధిక వర్షాల సమయంలో గ్రామంలో ఉన్న మురుగునీరు బయటకు పోక ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని, డ్రెయినేజీ కోడు విడగొట్టి ఆక్రమణదారులను తొలగించి తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు.
అధికారులకు కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశం మీకోసంలో 194 అర్జీలు స్వీకరించిన అధికారులు