
నిమ్న వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా అడుగులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నిమ్న వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా అధికారులు అడుగులు వేయాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ అన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ షెడ్యూల్డు కులాల సాంఘిక, ఆర్థిక అభివృద్ధి లో విశేష కృషి చేస్తోందని చెప్పారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఏవీఎస్ రెడ్డి వీసీ హాల్‌లో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ డైరెక్టర్ డాక్టర్ జి.సునీల్ కుమార్‌బాబు, కలెక్టర్ జి.లక్ష్మీశతో కలిసి జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎస్సీ జనాభా (2011 సెన్సస్ ప్రకారం 18.32 శాతం), ఎస్సీ వర్గాల్లో అక్షరాస్యత, వివిధ పథకాల అమలు, ఆరోగ్యం, పోషణ, భూ పంపిణీ, నవోదయం తదితర అంశాలను కలెక్టర్ లక్ష్మీశ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా శాఖల పరిధిలో అమలు చేస్తున్న కార్య క్రమాల ప్రగతిని వివరించారు. ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులు, వాటిలో పురోగతిని, గ్రామాల్లో సైతం సీసీ కెమెరాల ద్వారా నిఘా వంటి విషయాలను సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు వివరించారు.
ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి..
ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ మాట్లాడుతూ అట్రాసిటీకి సంబంధించి ఎస్సీల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్టుకు చర్యలు తీసుకోవాలన్నారు. మూడు నెలలకోసారి తప్పనిసరిగా డిస్ట్రిక్ట్ లెవెల్ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. చట్ట ప్రకారం పరిహారం, ఉపాధి కల్పనపై చర్యలు తీసుకోవాలన్నారు.