
పైసా వసూల్!
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రతి పనికీ ఓ రేటు
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులను సిబ్బంది జలగల్లా పట్టి పీడిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులు ఇస్తేనే రోగిని ఒక చోట నుంచి మరో చోటుకి తరలించే పరిస్థితి ఉందంటున్నారు. ఎవరైనా డబ్బులు ఇచ్చుకోలేని వారు వస్తే వారిని పట్టించుకోవడం లేదంటున్నారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులకు సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ వంటివి రాస్తే డబ్బులివ్వని వారిని రెండు మూడు రోజుల వరకూ స్కానింగ్‌కు తీసుకెళ్లడం లేదని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ప్రతి పనికీ ఒక ధర నిర్ణయించి మరీ వసూలు చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త ప్రభుత్వాస్పత్రిలో సిబ్బంది డిమాండ్ చేసి మరీ వసూళ్లు చేస్తున్నట్లు చెబుతున్నారు.
పనిని బట్టి రేటు..
క్యాజువాలిటీ నుంచి వార్డుకు రోగిని వీల్‌చైర్‌లో తరలిస్తే రూ.200, స్ట్రెచ్చర్‌పై అయితే రూ.300, సీటీ స్కాన్‌కు తీసుకెళ్తే రూ.200, ఎంఆర్‌ఐ కోసం అయితే రూ.500, ఐసీయూలో బెడ్ కావాలంటే డిమాండ్‌ను బట్టి రూ.500 నుంచి రూ.2 వేలు, రోగి మృతదేహాన్ని వార్డు నుంచి కిందకు దించాలంటే రూ.500, పోస్టుమార్టం చేయాలంటే రూ.1000 ఇలా విజయవాడ జీజీహెచ్‌లో ప్రతి పనికి సిబ్బంది ఫిక్స్‌డ్ రేట్లు పెట్టి రోగుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇవన్నీ అధికారికంగా అనుకునేరు.. అదేమి కాదు. అక్కడ పనిచేసే సిబ్బంది నిర్ణయించిన రేట్లు. బాగా పేదలైతే ఆ మొత్తంలో ఒక రూ.50 తగ్గిస్తారంతే. లేదంటే బంధువులే వీల్‌చైర్, స్ట్రెచ్చర్లు తీసుకుని రోగులను తరలించాల్సిన దయనీయ దుస్థితి నెలకొంది. అంతేకాదు నిత్యం రోగిని బంధువులే క్యాజువాలిటీ నుంచి సూపర్‌స్పెషాలటీ బ్లాక్, వార్డులకు తరలించే దృశ్యాలు కనిపిస్తూనే ఉంటాయి. అయినా అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తుంటారు.
పర్యవేక్షించే వారేరి..
ప్రభుత్వాస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఆర్‌ఎంఓలపై ఉంటుంది. ప్రస్తుతం కొత్తాస్పత్రిలో ఒక డెప్యూటీ ఆర్‌ఎంఓ మాత్రమే విధులు నిర్వహిస్తుండగా, ఆమె ఏసీ గది దాటి బయటకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా క్యాజువాలిటీ, ఐసీయూలు, ఏఎంసీ, ఆపరేషన్ థియేటర్‌ల వద్ద వసూళ్లు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆపరేషన్‌కు సిద్ధం చేసి రోగిని తీసుకెళ్లాలంటే సిబ్బందికి ముడుపులు చెల్లించుకోవాల్సిందే. ప్రాణాలు పోయినా వదలరు. మృతదేహాన్ని దించేందుకు సైతం డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. ఇలా ఆస్పత్రిలో యథేచ్ఛగా రోగులను దోపిడీ చేస్తున్నా పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో సిబ్బంది మరింత రెచ్చిపోతున్నారు.
ఇక్కడ ఎవరిది బాధ్యత?
ప్రభుత్వాస్పత్రిలో సూపరింటెండెంట్ తర్వాత సీఎస్ ఆర్‌ఎంఓ కీలకంగా వ్యవహరించాల్సి ఉంది. నాల్గో తరగతి సిబ్బంది, నర్సింగ్ సేవలు, రోగులకు పెట్టే ఆహారం నాణ్యత, శానిటేషన్, సెక్యూరిటీ వంటివి అన్నీ సీఎస్ ఆర్‌ఎంఓ పర్యవేక్షించాలి. కొత్త ఆస్పత్రి, పాత ఆస్పత్రు లకు ఆమె ఆర్‌ఎంఓగా వ్యవహరించాల్సి ఉండగా, ప్రస్తుతం ఆమెను పాత ప్రభుత్వాస్పత్రికే పరిమితం చేసేశారు. ఒకవేళ అక్కడ ఏదైనా పర్యవేక్షణ అవసరమైతే డెప్యూటీ ఆర్‌ఎంఓను పంపించాలి. అంతేకాని, ఆస్పత్రిలో కీలకంగా వ్యవహరించాల్సిన సీఎస్ ఆర్‌ఎంఓను పాత ఆస్పత్రికి పంపించడం నిబంధనలకు విరుద్ధమని పలువురు వైద్యులే చెబుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ పర్యవేక్షణ పూర్తిగా పడకేసిందంటున్నారు. దీంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రోగులను పీక్కుతింటున్నట్లు పలువురు తమ దృష్టికి కూడా తీసుకొస్తున్నారంటూ ఆస్పత్రి ఉద్యోగులే చెపుతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
రోగుల నుంచి భారీగా దండుకుంటున్న ఆస్పత్రి సిబ్బంది ప్రాణాలు పోయినా వదలని వైనం సేవలను పర్యవేక్షించేది ఎవరు? సీఎస్ ఆర్‌ఎంఓ పాత ఆస్పత్రికే పరిమితం
ఫిర్యాదు చేస్తే చర్యలు..
పాత ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే ఇద్దరు డెప్యూటీ ఆర్‌ఎంఓలు బదిలీ అయ్యారు. వారి స్థానంలో ఒకరు మాత్రమే వచ్చి విధుల్లో చేరారు. దీంతో సీఎస్ ఆర్‌ఎంఓను అక్కడ విధులు కేటాయించాం. రోగులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. సిబ్బంది ఎవరైన డబ్బులు డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయవచ్చు.
– డాక్టర్ ఏ వెంకటేశ్వరరావు,
సూపరింటెండెంట్

పైసా వసూల్!