
అన్యాయం అయిపోతున్నాం.. న్యాయం చేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): బదిలీల్లో తమకు అన్యాయం జరిగిందని, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని గ్రామ వ్యవసాయ సహాయకులు వేడుకున్నారు. వ్యవసాయశాఖ కార్యాలయంలో జేడీ చాంబర్ వద్ద సోమవారం రాత్రి వారు బైఠాయించారు. పిల్లాపాపలతో ఉన్న తమను వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలకు బదిలీ చేయటం ఎంతో బాధ కలిగించిందన్నారు. సచివాలయాల్లో ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్న తమ వెసులుబాటు పట్టించుకోకుండా ఇష్టానుసారం బదిలీ చేశారని ఆరోపించారు. అనారోగ్య సమస్యలు, స్పౌజ్ కేసులు, చంటి పిల్లలు ఉన్న తమను సుదూర ప్రాంతాలకు బదిలీ చేస్తే ఎలా వెళ్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు బదిలీల్లో అన్యాయం జరిగిందని పలుమార్లు అధికారులను కలిసి విన్నవించుకున్నామని గుర్తుచేశారు. అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని, అయితే తాము ఏమీ చేయలేమని అధికారులు చేతులు ఎత్తేశారని పేర్కొన్నారు. బదిలీలు జరిగినప్పటికీ తాము సుదూర ప్రాంతాలకు వెళ్లలేక, ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో వచ్చి అధికారులకు చెప్పుకుంటే, వారు న్యాయం చేయకపోగా ఈ విధంగా మాట్లాడటం ఎంతో బాధ కలిగిస్తోందన్నారు.