
ఇకపై ఇసుక ఉచితం కాదు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి కృష్ణా జిల్లాలో స్టాకు యార్డుల్లో మైనింగ్ అధికారులు ఇసుకను నిల్వ చేశారు. జిల్లా స్థాయి కమిటీ ఇసుక రీచ్‌కు స్టాకు యార్డుకు ఉన్న దూరంతో పాటు, తవ్వకం, లోడింగ్, రవాణాకు సంబంధించిన ఖర్చులను దృష్టిలో పెట్టుకొని స్టాకు యార్డుల్లో మెట్రిక్ టన్ను ఇసుక ధరలను నిర్ణయించింది. దీనిని బట్టే ఉచిత ఇసుక వట్టిదేనని తేలిపోతోంది. లబ్ధిదారులకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. మరోవైపు ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ప్రస్తుతం హరిత ట్రిబ్యూనల్ ఆదేశాల మేరకు అక్టోబర్ 15వ తేదీ వరకు నదుల్లో ఇసుక తవ్వకాలపై నిషేధం ఉంది. ఇసుక రీచ్‌లకు వెళ్లే మార్గాల్లో మైనింగ్ అధికారులు ట్రెంచ్‌లు కొట్టినప్పటికీ.. ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. దీనికి ప్రధాన కారణం ఈ అక్రమ రవాణా వెనుక టీడీపీ పార్లమెంటు, ఆయా నియోజకవర్గ స్థాయి ముఖ్యనేతల హస్తం ఉండటమేనని తెలుస్తోంది. మైనింగ్ అధికారులు దాడులు చేసి, వాహనాలను సీజ్ చేస్తున్నా.. రాత్రి వేళ్లలో ఈ దందాకు తెరలేపుతున్నారు. స్టాకు యార్డుల్లో ఇసుక నిల్వలు ఉన్నా, కృత్రిమ కొరత సృష్టించి దండుకొనే యత్నం చేస్తున్నారు. ఇప్పటికే పచ్చనేతలు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఇసుక డంపులు ఏర్పాటు చేసి, తెలంగాణ రాష్ట్రానికి ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక ధరలు ఇలా..
ఇసుక రీచ్ స్టాకు యార్డు దూరాన్ని బట్టి ఇప్పటికే జిల్లా స్థాయి కమిటీ ధరలు నిర్ణయించింది. ఏటూరు కంచికచర్ల అల్లూరుపాడు స్టాకు యార్డులో మెట్రిక్ టన్ను ఇసుక ధర రూ.174 కీసర, మొగలూరు స్టాకుయార్డుల్లో ఇసుక ధర మెట్రిక్ టన్ను రూ. 202, ఇబ్రహీంపట్నంలో స్టాకు యార్డులో మెట్రిక్ టన్ను ఇసుక ధర రూ.380గా నిర్ణయించింది. స్టాకు యార్డుల నుంచి ఇసుక తీసుకెళ్లే వెసులుబాటు కల్పించింది. ఏపీ శాండ్ మేనేజ్‌మేంట్ యాప్‌లో వివరాలు నమోదు చేసుకొని డబ్బులు చెల్లిస్తే, బిల్లు జనరేట్ అవుతోంది. ఈ బిల్లు స్టాకు యార్డులో చూపితే, ఇసుక లోడింగ్ చేస్తారు. ఇంత వరకు స్టాకు యార్డుల నుంచి లబ్ధిదారులు తీసుకెళ్లలేదు. ఇప్పటికీ నదుల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో స్టాకు యార్డుల్లో నిల్వలు ఇలా..
మండలం స్టాకు యార్డు ప్రదేశం అందుబాటులో ఉన్న ఇసుక(మెట్రిక్ టన్నుల్లో)
వత్సవాయి అల్లూరుపాడు 50,000
చందర్లపాడు ఏటూరు 30,000
కంచికచర్ల కంచికచర్ల 70,000
కంచికచర్ల కీసర 3,50,000
ఇబ్రహీపట్నం ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్ 4,00,000
మొత్తం 9,00,000
ధరలు నిర్ణయించిన జిల్లా కమిటీలు
వర్షాల కారణంతో
స్టాక్ యార్డుల్లో ఇసుక నిల్వలు
ఎన్టీఆర్ జిల్లాలో 9 లక్షల టన్నులు,
కృష్ణాలో 7.5లక్షల టన్నులు నిల్వ
నదుల్లో తవ్వకాలపై ఇప్పటికే నిషేధం
అయినప్పటికీ ఆగని అక్రమ రవాణా