
రిమాండ్‌కు హత్య కేసు నిందితులు
జి.కొండూరు: చెవుటూరులో హైమావతిని(65)ని హత్య చేసిన ఆమె మనవడు ఉమ్మడి వేణుగోపాలరావుతో పాటు అతడికి సహకరించిన స్నేహితుడు ఆకుల గోపిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు మైలవరం ఏసీపీ వై.ప్రసాదరావు తెలిపారు. నిందితులు ఇద్దరిని శుక్రవారం సాయంత్రం జి.కొండూరు పోలీసుస్టేషన్‌లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. హత్యకు గల కారణాలను వెల్లడించారు. ఏసీపీ మాట్లాడుతూ ఆస్తి పంపకాల విషయమై వివాదం తలెత్తి నాయనమ్మ, తాతయ్యను హతమార్చితే ఆస్తి తనకే వస్తుందని భావించిన నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. పరిటాలలో నివాసం ఉంటున్న నిందితుడు వేణుగోపాలరావు అతడి స్నేహితుడు గోపీతో కలిసి ఈ నెల ఒకటో తేదీన బైక్‌పై చెవుటూరు వచ్చారన్నారు. వేణుగోపాలరావు నాయనమ్మ హైమావతి కదలికలను పసిగట్టారన్నారు. హైమావతి పశువులను మేపేందుకు గ్రామ శివారులోని పొలాల్లోకి వెళ్లగా ఉదయం 11.15 గంటల సమయంలో నిందితుడు వేణుగోపాలరావు అక్కడికి వెళ్లి వెదురు కర్రతో దాడి చేసి పెట్రోలు పోసి నిప్పంటించి హత్య చేసినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కదలికలను పసిగట్టి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించి, నిందితులను త్వరితగతిన అదుపులోకి తీసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మైలవరం సీఐ దాడి చంద్రశేఖర్, జి.కొండూరు ఎస్‌ఐ కె.సతీష్‌కుమార్, పోలీసు సిబ్బందిని ఏసీపీ అభినందించారు.