
భూగర్భ జలవిలాపం
కూటమి అధికారంలోకి వచ్చాక యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వీరులపాడు మండలంలో కట్టలేరు ఒడ్డునే ఉన్న దొడ్డదేవరపాడు గ్రామానికి తాగునీటి కష్టాలు తప్పడం లేదు. గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వి.అన్నవరం వద్ద వైరా నదిలో బోరు వేసి, అక్కడి నుంచి పైపులైన్ ద్వారా దొడ్డదేవరపాడు గ్రామంలోని ట్యాంక్‌ను నీటితో నింపుతున్నారు. ఆ నీటిని గ్రామంలోని దళిత కాలనీ, బీసీ కాలనీకి వంతుల వారీగా మూడు రోజులకోసారి సరఫరా చేస్తున్నారు. అది కూడా అరకొరగానే. తరచూ పైపులైన్లు లీకవడం, విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల ఇబ్బందులు తప్పడంలేదు. తీగునీరు అందని దళితవాడ వాసులు కట్టలేరులో చలమల నీటితోనే దాహార్తి తీర్చుకుంటున్నారు. యువకులు సైకిళ్లకు ప్లాస్టిక్ క్యాన్లు కట్టుకుని, మహిళలు బిందెలతో చెలమల వద్దకు వచ్చి తాగునీటిని తీసుకెళ్లడం ఇక్కడ నిత్య కృత్యం.
తాగునీటి కష్టాలు ఒక్క దొడ్డదేవరపాడు గ్రామానికే పరిమితం కాలేదు. ఏటిపట్టు గ్రామాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. నీరు అందక రక్షిత మంచినీటి పథకం మోటార్లు పాడైపోతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాకు ఓ వైపు కృష్ణానది మూడు వైపులా మున్నేరు, వైరా, కట్టలేరు ఉపనదులు ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాల మోటార్లను కృష్ణా, ఉపనదుల ఒడ్డునే ఏర్పాటు చేశారు. కూటమి అధికారం చేపట్టిన తర్వాత వాగులు, వంకలు, ఏర్లు అన్న తేడా లేకుండా విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతు న్నాయి. కృష్ణా నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేపట్టడంతో పరివాహక ప్రాంతంలోని రక్షిత మంచినీటి పథకాలకు నీరు అందడం లేదు. నదికి నీటి ప్రవాహ పాయలు కుడివైపుగా ఉండడం, ఎడమవైపు పొక్లెయిన్లతో ఇసుక తవ్వడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. కంచికచర్ల మండలంలోని పరిటాల గ్రామంలో గత ఏడాది మార్చిలో 7.34 మీటర్లలో లోతున భూగర్భలాలు నమోద య్యాయి. ఈ ఏడాది మార్చి నాటికి 8.63 మీటర్లకు పడిపోయాయి. పెండ్యాలలో 3.99 మీటర్ల నుంచి 4.5 మీటర్లకు భూగర్భ జలాలు పడిపోయాయి.
ఎక్కడ చూసినా ఇసుక తవ్వకాల జాడలే..
కంచికచర్ల మండలంలో దాదాపు అన్ని గ్రామాలకు కృష్ణానది నుంచి, నాలుగైదు గ్రామాలకు మున్నేటి నుంచి తాగునీటి సరఫరా జరుగుతోంది. ప్రస్తుతం కృష్ణానదిలో ఎక్కడ చూసినా ఇసుక తవ్విన జాడలే కనిపిస్తున్నాయి. నదిలో నీరు లేకపోవడంతో మండల ప్రజలు తాగునీరు, వాడుక నీటి అవసరాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చందర్లపాడు మండలం కాసరబాద నది ఒడ్డునే ఉన్నప్పటికీ నీటి కష్టాలు తప్పడం లేదు. ఇక్కడ ఇసుక తవ్వకాలు అడ్డగోలుగా సాగుతున్నాయి. పొక్కునూరు గ్రామంలోనూ నీటి ఎద్దడితో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. వత్సవాయి మండ లంలో మున్నేరు పరివాహక గ్రామాల్లో సైతం భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి అవస్థలు తప్పడం లేదు. డ్యామ్ ఉన్న పోలంపల్లిలోనే భూగర్భ జలమట్టం తగ్గిపోయింది. ఎ.కొండూరు మండలంలో స్థానికంగా లభించే నీటిని తాగునీటికి వినియోగించే పరిస్థితి లేదు.
ఎటు చూసినా ఇసుకే..
విచ్చలవిడి ఇసుక తవ్వకాలతో
అడుగంటిన భూగర్భ జలాలు
నదీ పరివాహక ప్రాంతాల్లో
ఎండిపోయిన రక్షిత నీటి పథకాలు
పల్లెలు, పట్టణాల్లో తాగునీరు అదంక
ప్రజలకు తప్పని ఇబ్బందులు
నందిగామ పట్టణంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. పట్టణానికి తాగునీరు సరఫరాచేసేందుకు మునేరులో ఆరు బోర్లు వేశారు. నాలుగు బోర్లలో నీరు పూర్తిగా అడుగంటింది. రెండు బోర్ల ద్వారా అరకొర నీరు సరఫరా అవుతోంది. దీంతో మునిసిపాలిటీలో నాలుగైదు రోజులకు ఓ సారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఉచిత ఇసుక పథకం పేరుతో కూటమి నేతలు జేసీబీలతో విచ్చలవిడిగా ఇసుకను తోడేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు.
చందర్లపాడు మండలం కాసరబాద కృష్ణానదిలో ఇసుక రీచ్ పేరుతో ఇరవై అడుగుల లోతు పెట్టి పెద్ద పొక్లెయిన్లతో ఇసుకను తవ్వటంతో నదిలో ఇసుక తప్ప చుక్కనీరు కనిపించటంలేదు.
కంచికచర్ల మండలం కీసర, వేములపల్లి, పెండ్యాల, రీచ్‌లలో ఇసుకను అక్రమంగా తవ్వకాలు జరపటంతో మున్నేరులో కనీసం పశువులు తాగేందుకు చుక్కనీరు కరువైంది. నీరు అందక విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయి. ఇటీవల గండేపల్లి, కంచికచర్ల గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే విద్యుత్ మోటార్లు పూర్తిగా కాలిపోయాయి.

భూగర్భ జలవిలాపం