
‘ఉపాధి’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ
కంచికచర్ల: జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా రోజుకి లక్షమంది కూలీలకు పనులు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. కంచికచర్ల మండలం పరిటాలలో జరుగుతున్న ఉపాధిహామీ పథకం పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధిహామీ పథకం ద్వారా పనిచేసే కూలీలకు రోజుకు రూ. 307 వచ్చేలా కొలతలు ఇచ్చి పనులు చేయిస్తున్నామని చెప్పారు. ప్రతి కూలీ 100రోజులు పని పూర్తి చేసేలా ఉపాధిహామీ పథకం అధికారులు చూడాలన్నారు. పథకం ద్వారా రైతులు తమ పొలా ల్లో నీటిని నిల్వ చేసుకునేందుకు ఫార్మ్ పాండ్(నీటి కుంట)లను తీయించుకోవాలని కలెక్టర్ అన్నారు. నందిగామ ఆర్డీఓ కే బాలకృష్ణ, ఎంపీడీఓ బీఎం విజయలక్ష్మి, ఏఓ కె. విజయకుమార్, ఏపీఓ రమాదేవి, ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారు.