ఆగని కూటమి నేతల దోపిడీ పర్వం | - | Sakshi
Sakshi News home page

ఆగని కూటమి నేతల దోపిడీ పర్వం

Mar 24 2025 2:32 AM | Updated on Mar 24 2025 2:33 AM

కృష్ణాజిల్లాలో ఇసుకదందా జోరుగా సాగుతోంది. కూటమి నాయకుల కనుసన్నల్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ప్రజాప్రతినిధుల అండతో వారి అనుచరగణం అధికారమే పరమావధిగా క్వారీల్లో ఇసుకను దోచేస్తూ భారీగా లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో కృష్ణానది పరీవాహక ప్రాంతమైన కంకిపాడు మండలం మద్దూరు, తోట్లవల్లూరు మండలం రొయ్యూరు, నార్తువల్లూరు, ఘంటసాల మండలం శ్రీకాకుళం రేవుల్లో ఇసుక తవ్వకాలు గత కొంతకాలంగా యథేచ్ఛగా సాగు తున్నాయి. గతంలో ఇచ్చిన అనుమతులు ఫిబ్రవరి 6తో ముగియటంతో అధికారులు అదే రీచ్‌లకు రెన్యువల్‌ చేసి జూలై 14 వరకు అనుమతులు మంజూరు చేశారు. కూటమి ఎమ్మెల్యేల అండదండలతో ఆయా రీచ్‌లలో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు రాత్రి, పగలు తేడా లేకుండా జరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భారీ లోడుతో లారీలు ఇసుకను రవాణా చేస్తున్నాయి. ఇరవై టన్నుల లోడుతో వెళ్లాల్సిన లారీలు నలభై టన్నులు పైగా ఇసుకను రవాణా చేస్తుండటంతో రహదారులు దెబ్బతింటున్నాయి. ఇసుక లారీల రవాణాతో రోడ్లు దుమ్మెత్తిపోతున్నాయి. అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు ఆయా క్వారీల వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

కంచికచర్ల: ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల్లో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. కృష్ణానది, మునేరు, వైరా ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ఇసుకను తెలుగుతమ్ముళ్లు నిత్యం దోచుకుంటున్నారు. పగలూరాత్రి తేడా లేకుండా రీచ్‌ల వద్ద అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా చందర్లపాడు మండలం కాసరబాద ఇసుక రీచ్‌లో బిల్లులు లేకుండా ఒక్కో లారీకి రూ.10వేలు చెల్లిస్తే చాలు లోడింగ్‌ ఎంతైనా ఇసుక నింపుతాం అంటూ నిర్వాహకులు ఓపెన్‌ ఆఫర్‌ చేస్తున్నారు. ఇలా రోజుకు రూ. 10లక్షల ఆదాయం దోచుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు.

తెలంగాణాకు అక్రమ రవాణా..

నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతంలోని ఇసుకకు తెలంగాణాలో భారీ డిమాండ్‌ ఉంది. మునేరు, కృష్ణానది ఇసుకకు అక్కడ మంచి ధర లభిస్తోంది. లారీ ఇసుక ధర ఖమ్మం, వైరా రూ.45వేల నుంచి రూ. 60వేలు వరకు డిమాండ్‌ ఉంది. అదే హైద్రాబాద్‌లో రూ. 90 వేల నుంచి రూ.1లక్ష వరకు ధర ఉంటుంది. అధికారపార్టీకి చెందిన ఎంపీతో పాటు, టీడీపీ నాయకులు ఆయా ప్రాంతాలకు ఇసుకను తరలించి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇటీవల తెలంగాణా రాష్ట్ర సరిహద్దులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 14 లారీలను అధికారులు పట్టుకున్నారు. అయినా ఇసుక దందా ఆగటంలేదు. కంచికచర్ల మండలం కీసర మునేరు ఉపనది నుంచి టీడీపీకి చెందిన ఓ చోటా నాయకుడు పగటి పూట ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలించి గ్రామంలో ఓ దేవాలయం సమీపంలో డంపింగ్‌ చేసి రాత్రి సమయంలో ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. అటువైపు కనీసం రెవెన్యూ, పోలీస్‌, మైనింగ్‌ అధికారులు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు అధికారులపై మండిపడుతున్నారు. నందిగామ మండలం మాగల్లు, పెనుగంచిప్రోలు మండలం శనగపాడు, జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు, చిట్యాల, మునేరు నుంచి కూటమి నేతలు ఇసుకను తవ్వి ఇతర రాష్ట్రాలకు లారీలతో తరలిస్తున్నారు.

కృష్ణమ్మకు గర్భశోకం..

కృష్ణానది మధ్యలో ఇసుక తవ్వకాలు భారీగా జరుపుతున్నారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద కృష్ణా నదిలో అధికారుల అనుమతులు లేకుండా కూటమి నాయకులు భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. నదీ గర్భంలో ఇసుకను తవ్వకూడదనే ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. వాల్టా చట్టానికి తూట్లు పొడిచి నదీ గర్భంలో డ్రెడ్జింగ్‌ యంత్రాలు వినియోగించి ఇసుకను తవ్వేస్తున్నారు. అయినప్పటికీ ఇల్లు నిర్మించుకునే అసలైన లబ్ధిదారులకు ఇసుక దొరకటం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

కృష్ణా, ఎన్జీఆర్‌ జిల్లాల్లో

దోచుకో.. పంచుకో..

ఉచితం మాటున భారీగా ఆదాయార్జన

ఎన్టీఆర్‌ జిల్లాలో ఎంపీ

కనుసన్నల్లో అంతా!

స్థానిక అధికారపార్టీ

ప్రజా ప్రతినిధులకూ వాటాలు

ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్న

అక్రమ ఇసుక

పట్టించుకోని మైనింగ్‌, రెవెన్యూ,

పోలీస్‌ అధికారులు

ఆగని కూటమి నేతల దోపిడీ పర్వం1
1/2

ఆగని కూటమి నేతల దోపిడీ పర్వం

ఆగని కూటమి నేతల దోపిడీ పర్వం2
2/2

ఆగని కూటమి నేతల దోపిడీ పర్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement