
సామాజిక అంశాల సమాహారం షరీఫ్ కథలు
విజయవాడ కల్చరల్: సామాజిక అంశాల సమాహారం వేంపల్లి షరీఫ్ కథలు అని కవి ఖాదర్ మొహిద్దీన్ అన్నారు. సూఫీ ప్రచురణల ఆధ్వర్యాన విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యాలయంలో ఆదివారం కథా రచయిత వేంపల్లి షరీఫ్ రచించిన చారులపిల్లి కథల సంపుటి ఆవిష్కరణ జరిగింది. మొహిద్దీన్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న వివక్ష, మానవీయ అంశాలను ప్రస్తావిస్తూ కథా సంకలనం సాగుతుందన్నారు. కథా రచయిత కాట్రగడ్డ దయానంద్ మాట్లాడుతూ షరీఫ్ సాహిత్యంలో సామాజిక చిత్రీకరణ కనిస్తుందన్నారు. షరీఫ్ రచించిన జుమ్మా కథల సంపుటికి కేంద్ర సాహిత్య యువ పురస్కారం లభించినట్లు తెలిపారు. ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక ఏపీ కార్యదర్శి కేఎస్ మల్లీశ్వరి మాట్లాడుతూ షరీఫ్ మూడు కథా సంకలనాలను వెలువరించారని, ముస్లిం కుటుంబాల జీవన విధానం ఆయన సాహిత్యంలో కనిపిస్తుందని తెలిపారు. కవి అనిల్ డ్యానీ, ఛాయ సాహిత్య మాసపత్రిక సంపాదకుడు అరుణ్ శశాంక్.. షరీఫ్ సాహిత్య విశేషాలను వివరించారు. రచయిత షరీఫ్ తనకు ప్రేరణ కల్గించిన అంశాలను తెలిపారు.