పచ్చ దొంగలు దొరికారు! | - | Sakshi
Sakshi News home page

పచ్చ దొంగలు దొరికారు!

Apr 27 2023 8:22 AM | Updated on Apr 27 2023 9:14 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయవాడ: బెజవాడలో తెలుగు తమ్ముళ్లు దొంగతనాల వైపు దృష్టి సారించారు. తాళాలు వేసిన ఇంటిని టార్గెట్‌ చేసుకొని సినీఫక్కీ లో చోరికి పాల్పడ్డారు. ఈ విషయం ఇప్పుడు నగరంలో కలకలం రేపుతోంది. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ప్రధాన అనుచరులు ఈ దొంగతనాలకు పాల్పడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. సిరీస్‌ కంపెనీ అధినేత ఇంట్లో జరిగిన దొంగతనం కేసు విచారణలో పచ్చ తమ్ముళ్ల పాత్రను నిర్ధారించుకున్న పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల్లో టీడీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు ఉన్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ తరఫున 18 డివిజన్‌కు పోటీచేసి ఓడిపోయిన మైలుమూరి పీరుబాబు, 22వ డివిజన్‌ టీడీపీ నేత పెద్ది అన్నారావులు కీలక పాత్ర పోషించారు. వీరు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ప్రధాన అనుచరులు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోనూ వీరు భాగస్వాములు కావడం గమనార్హం. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్న వెంటనే, ఎమ్మెల్యే గద్దె రంగంలోకి దిగి, కేసు నీరుగార్చేందుకు విఫలయత్నం చేసినట్లు తెలిసింది. పక్కా ఆధారాలు ఉండటంతో పోలీసులు ఒత్తిళ్లకు లొంగకుండా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవి..
సిరీస్‌ రాజుకు చెందిన ఇల్లు లబ్బీపేటలో ఉంది. ప్రస్తుతం ఆ ఇంటి నిర్వహణను సిరీస్‌ కంపెనీకి చెందిన మేనేజర్‌ ఇంద్రశేఖర్‌ చూస్తున్నారు. ఇంట్లో ఎవ్వరూ ఉండటం లేదు. సామాన్లు మాత్రం ఉన్నాయి. మేనేజర్‌ అప్పుడప్పుడు హౌస్‌ కీపింగ్‌ చేసేందుకు ఇంటి తాళాలు తీసేవారు. గత కొంత కాలంగా ఆ ఇంటికి తాళాలు వేసి ఉండటంతో ఆ ఇంటిపైన కన్నేసిన రాణిగారితోటకు చెందిన ముప్పిడి యాదగిరి, దురుబేసుల కరీముల్లా అనే వ్యక్తులు ఇంటి తాళాలు పగుల గొట్టి ఈ నెల 19న ఒకసారి, 20న మరోసారి లోపలికి వెళ్లారు. రెండు రోజుల్లో పూజగదిలోని వెండి, బంగారు వస్తువులతో పాటు 2.25 కిలోల వెండి, 14 గ్రాముల బంగారు దొంగిలించారు. ఆ తర్వాత ఇంటి తాళాలు తెరిచి ఉండటాన్ని గమనించిన మేనేజర్‌ ఇంట్లోని వస్తువులు చోరికి గురైనట్లు కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు అక్కడ లభించిన వేలిముద్రల ఆధారంగా, పాత నేరస్తుడైన యాద గిరిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు గుట్టు రట్టు అయ్యింది. యాదగిరి తన స్నేహితుడైన కరీముల్లాతో కలిసి దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకొన్నాడు.

లింక్‌ ఇది..
దొంగతనానికి పాల్పడిన కరీముల్లా టీడీపీ నేత పీరుబాబుకు మేనల్లుడు. దొంగలించుకొని వచ్చిన వెండి వస్తువులను టీడీపీ నేత పీరుబాబు, గవర్నర్‌పేటలో సిల్వర్‌షాపు ఉన్న టీడీపీ నేత అన్నారావులు వద్దకు తెచ్చి ఇచ్చారు. వీరిద్దరు దానిని కరిగించి రూ.51 వేలకు అమ్మినట్లు తెలిసింది. దీంతోపాటు కొన్ని వస్తువులను రాణిగారితోటకే చెందిన దేవిరెడ్డి మహేష్‌ అనే వ్యక్తి ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement