ఆదివాసీ మహిళా ఎమ్మెల్యేపై వివక్ష | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీ మహిళా ఎమ్మెల్యేపై వివక్ష

Jun 2 2026 11:51 PM | Updated on Jun 2 2026 11:51 PM

● హామీలు ప్రశ్నిస్తాననే మాట్లాడే అవకాశం ఇవ్వలేదు ● ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌: కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద నిర్వహించిన ప్రజాపాలన– ప్రగతి బాట సీఎం సభలో ఆదివాసీ మహిళా ఎమ్మెల్యే అయిన తనపై వివక్ష చూపించారని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రభు త్వ కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమంలా మార్చారని, ఎన్నికల హామీలు ప్రశ్నిస్తానని తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేను విస్మరించి.. పక్క జిల్లా ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గుండి, లక్మాపూర్‌ వంతెనలు, కుమురం భీం, వట్టివాగు ప్రాజెక్టుల కాల్వల మరమ్మతులు, మెడికల్‌ కళాశాలలో బోధనా సిబ్బంది, ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల కొరత, రోడ్ల దుస్థితి గురించి సీఎంకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నా అవకాశం ఇవ్వలేదని తెలిపారు. ఆరు గ్యారంటీలు, ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్‌ సర్కారు విఫలమైందని విమర్శించారు. ప్రజాధనంతో బహిరంగ సభ నిర్వహించి ప్రచారం చేసుకోవడం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీకి మంజూరైన రూ.15 కోట్ల పనులకు ఇప్పటికే శంకుస్థాపన చేశామని, వీటికి మళ్లీ సీఎం శంకుస్థాపన చేయడం ఏంటని ప్రశ్నిచారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ మెంగ్రె ఆకాశ్‌, వైస్‌ చైర్మన్‌ ఎండీ అహ్మద్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ అలీబిన్‌ అహ్మ ద్‌, రాజంపేట సర్పంచ్‌ బుర్స పోచయ్య, కౌన్సిలర్లు బాలకృష్ణ, నాగుబాయి, పట్టణ అధ్యక్షుడు అహ్మద్‌, నాయకులు అన్సార్‌, సాయిశ్రావణ్‌, నిసార్‌, అశోక్‌, సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement