గ్రామ, వార్డు సభలు నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

గ్రామ, వార్డు సభలు నిర్వహించాలి

Jun 2 2026 11:51 PM | Updated on Jun 2 2026 11:51 PM

ఆసిఫాబాద్‌: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి డీజీపీ సీవీ ఆనంద్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ గ్రామ సభల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమం ఉద్దేశాన్ని వివరించాలని, పర్యావరణం, అటవీ శాఖలపై చర్చించాలన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులు, విత్తనాలు అందించేందుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. మహిళల రక్షణ, మాదకద్రవ్యాల నియంత్రణ, రహదారి భద్రత గురించి ప్రజలకు వివరించాలన్నారు. వర్షాకాలంలో పారిశుద్ధ్యం, మురుగు కాల్వల శుభ్రత, ప్లాస్టిక్‌ వ్యర్థాల తరలింపు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర, కేంద్ర ప్రకృతి విపత్తుల ప్రతిస్పందన బృందాలు, రెస్క్యూ బృందాలు సిద్ధం చేసుకోవాలన్నారు. వనమహోత్సవంలో భాగంగా లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ కె.హరిత, ఎస్పీ నితిక పంత్‌, అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. జిల్లా అధికారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 335 పంచాయతీలు, రెండు మున్సిపాలిటీల్లో నాలుగు రోజులపాటు సభలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement