‘ఇందిరమ్మ’ బిల్లు తారుమారు
వాంకిడి: ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల వివరాల నమోదులో జరిగిన తప్పిదంతో బిల్లులు తారుమారైన ఘటన వాంకిడి మండలం ఖమాన గ్రామంలో చోటుచేసుకుంది. అర్హులుగా గుర్తించిన ఒకే వాడకు చెందిన ఇద్దరు లబ్ధిదారుల పేర్లు ఒకేలా ఉండటంతో.. ఇంటి నిర్మాణం ప్రారంభించిన వారి ఖాతాకు బదులుగా మరొకరి ఖాతాలో మొదటి విడత బిల్లు జమ చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకా రం.. ఖమాన గ్రామానికి చెందిన లోబడె సాయికుమార్, లోబడె సోని దంపతులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. కొన్ని నెలల క్రితం పనులు ప్రారంభించి ఇటీవల బేస్‌మెంట్ పనులు పూర్తిచేశారు. అధికారులు పనుల ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్ చేశారు. దంపతులు బిల్లుల గురించి ఆరా తీయగా, అధికారులు బ్యాంకులో తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఖాతాలో నగదు జమ కాకపోవడంతో తిరిగి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా బిల్లులు వేరేవారి ఖాతాల్లో జమ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
తప్పిదం జరిగిందిలా..
ఖమాన గ్రామంలోని తేలివాడలో లోబడె సాయి కుమార్, లోబడె సోని పేర్లతో రెండు కుటుంబాలు ఉన్నారు. వీరి పేర్లు అర్హుల లిస్ట్–1లోనే ఉన్నాయి. లోబడె సాయి కుమార్(తండ్రి పేరు శ్రావణ్) భార్యకు ఇంటి మంజూరు పత్రం అందించారు. కానీ ఈ బిల్లు రూ.లక్ష మాత్రం లోబడె సాయికుమార్(తండ్రి పేరు పెంటు) భార్య ఖాతాలో జమయ్యాయి. వివరాల నమోదులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే తప్పిదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు సొంతింటి కోసం ఉన్న పందిరిని తొలగించి అప్పు తెచ్చి పనులు ప్రారంభించామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు అందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఎంపీడీవో పాటిల్ జ్యోత్స్నను వివరణ కోరగా.. బిల్లుల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తప్పిదం ఎక్కడ జరిగిందో గుర్తిస్తామని, విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.


