‘తొలి’ అవకాశం ఎవరికో..?
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రం ఆసిఫాబాద్ నుంచి విడిపోయి నూతన పంచాయతీ రాజంపేటలో తొలి సర్పంచ్ అవకాశం ఎవరికి దక్కుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పంచాయతీలో సర్పంచ్ స్థానం ఎస్టీలకు రిజర్వ్ చేయగా, 10 వార్డులో ఐదు ఎస్టీలు, ఐదు జనరల్‌కు కేటాయించారు. ఇక్కడ 1,964 మంది ఓటర్లు ఉన్నారు.
మున్సిపాలిటీ నుంచి విడిపోయి..
1913 నుంచి 1940 వరకు ఆసిఫాబాద్ ఉమ్మడి జిల్లా కేంద్రంగా కొనసాగింది. ఆ తర్వాత జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌కు తరలిపోగా, ఆసిఫాబాద్ 1961 వరకు పురపాలక కేంద్రంగా ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత జిల్లాల పునర్విభజనలో భాగంగా ఆసిఫాబాద్ కేంద్రంగా కుమురంభీం పేరుతో జిల్లా ఏర్పడింది. కాగజ్‌నగర్ పట్టణం మున్సిపాలిటీగా మారగా, ఆసిఫాబాద్ పట్టణాన్ని మేజర్ పంచాయతీగా మార్చారు. 2019 ఆగస్టు 2న ఆసిఫాబాద్‌ను నూతన మున్సిపాలిటీగా ప్రకటించారు. కానీ ఏజెన్సీ గ్రామం రాజంపేట్ కలిసి ఉండటంతో ప్రక్రియ ముందుకు సాగలేదు. ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 3న రాజంపేటను నూతన పంచాయతీగా.. ఆసిఫాబాద్‌ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది.
తీవ్రంగా పోటీ
రాజంపేట పంచాయతీలో సర్పంచ్ స్థానం కోసం పోటాపోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి విశ్రాంత ఎంఈవో నాంపెల్లి శంకర్, బీఆర్‌ఎస్ నుంచి తుడుందెబ్బ నాయకుడు బుర్స పోచయ్య, బీజేపీ నుంచి ఆదివాసీ నాయకుడు మడావి శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. 2012 నుంచి ప్రత్యేక పాలన కొనసాగుతుంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత పంచాయతీ ఎన్నికల్లో ఓటువేసేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు.
పంచాయతీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలి
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ నుంచి విడిపోయిన రాజంపేటకు నూతన పంచాయతీ అవకాశం వచ్చింది. కొత్త సర్పంచ్ పంచాయతీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలి.
– బొట్టుపల్లి ప్రశాంత్, రాజంపేట
ఉత్సాహంగా ఉన్నాం
సొంత పంచాయతీలో ఓటు వేసేందుకు ఉత్సాహంగా ఉన్నాం. వార్డుల్లో ఏ సమస్య ఉన్నా సత్వరమే పరిష్కరించే విధంగా నూతన సర్పంచ్ పాలన కొనసాగించాలి.
– చెన్నూరి శ్రీనివాస్, రాజంపేట
‘తొలి’ అవకాశం ఎవరికో..?
‘తొలి’ అవకాశం ఎవరికో..?


