తుదిపోరుకు సంసిద్ధం
రేపు నాలుగు మండలాల్లో పంచాయతీ ఎన్నికలు నేడు సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు ముగిసిన ప్రచార పర్వం పట్టు నిలుపుకొనేందుకు ప్రధాన పార్టీల ప్రయత్నాలు
ఆసిఫాబాద్: తొలి, మలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాతంగా ముగియడంతో అధికార యంత్రాంగం తుది విడత పోలింగ్‌కు సంసిద్ధమైంది. ఈ నెల 17న ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, రెబ్బెన, తిర్యాణి మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలతో ఆయా ప్రాంతాల్లో ప్రచార పర్వం ముగిసింది. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంతోపాటు కాగజ్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, రెబ్బెనలోని కె గార్డెన్, తిర్యాణి ఎంపీడీవో కార్యాలయాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ చేయనున్నారు. ఎన్నికల నిర్వహణకు 27 రూట్లు 27 జోన్లు ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్‌లో ఏడు జోన్లు, కాగజ్‌నగర్ 8, రెబ్బెన 6, తిర్యాణిలో 6 జోన్లు ఉన్నాయి.
104 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు
నాలుగు మండలాల్లోని 108 పంచాయతీల్లో రెండోచోట్ల రిజర్వేషన్లు కలిసిరాక నామినేషన్లు దాఖలు కాలేదు. మరో రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 104 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక 938 వార్డు స్థానాలకు 186 ఏకగ్రీవం కాగా, 8 స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 744 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నాలుగు మండలాల్లో 1,22,249 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 938 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, 1079 మంది పీవోలు, 1241 ఓపీవోలను విధులు కేటాయించారు.
ముగిసిన ప్రచారం.. ప్రలోభాలపై దృష్టి
మూడో విడత ఎన్నికల ప్రచారం సోమవారం సా యంత్రం 5 గంటలకు ముగిసింది. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి సైలెంట్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలోపు గుంపులుగా ఉండరాదు. ప్ర చార పర్వం ముగియడంతో అభ్యర్థులు ప్రలోభాల పై దృష్టి సారించారు. ఎలాగైనా విజయం సాధించా లని రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. విందులు, మద్యం, డబ్బుతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని రాజంపేట, గుండి, బూర్గుడతోపాటు కాగజ్‌నగర్, రెబ్బెన, తిర్యాణి మండలాల్లోని మేజర్ పంచాయతీల్లో పోటీ అధికంగా ఉంది.
ప్రధాన పార్టీలకు సవాల్
పంచాయతీ ఎన్నికలు ప్రధాన పార్టీలకు సవాల్‌గా మారాయి. తొలి, మలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీ మద్దతుదారులు పో టాపోటీగా విజయం సాధించారు. అన్నిపార్టీలకు చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు దక్కాయి. దీంతో మూడో విడతలో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, ఎమ్మెల్సీ దండె విఠల్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఇప్పటికే పల్లెలు చుట్టేశారు. చివరిరోజు కూడా ముమ్మరంగా ప్రచారం చేశారు. అలాగే ఆ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే కోనప్ప, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కాగజ్‌నగర్ మండలంలోని పంచాయతీల్లో పట్టు నిలుపుకొనేందుకు యత్నిస్తున్నా రు. బీజేపీ నుంచి ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, అరిగెల నాగేశ్వర్‌రావు, కోట్నాక విజయ్, కేసరి ఆంజనేయులుగౌడ్‌తో పాటు పార్టీ ప్రముఖులు మద్దతుదారుల గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు.
అందరి దృష్టి రాజంపేటపైనే..
ఆసిఫాబాద్ మండలంలో కొత్తగా ఏర్పడిన రాజంపేట పంచాయతీలో ప్రధాన పార్టీల మద్దతుదారులు రంగంలోకి దిగడంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ నుంచి విడిపోయిన ఏజెన్సీ పంచాయతీ రాజంపేటలో కాంగ్రెస్ నుంచి విశ్రాంత ఎంఈవో నాంపెల్లి శంకర్, బీఆర్‌ఎస్ నుంచి తుడుందెబ్బ నాయకుడు బుర్స పోచయ్య, బీజేపీ నుంచి ఆదివాసీ నాయకుడు మడావి శ్రీనివాస్ సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. నువ్వానేనా అంటూ పోటీ పడుతూ ప్రచారం చేశారు. ఇక్కడ 1900 పైచిలుకు ఓటర్లు ఉన్నాయి.
17న సెలవు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో ఈ నెల 17న మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, స్థాని క, ప్రభుత్వ సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సోమవారం తెలి పారు. ఓటుహక్కు వినియోగించుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అత్యవసరానికి లోబడి కార్యాలయానికి ఆలస్యంగా హాజరుకావడం, త్వరగా వెళ్లడం, తక్కువ వ్యవధి గైర్హాజరును వినియోగించుకోవచ్చన్నారు. ఎన్నికల కోసం వినియోగించే ప్రజాభవనాలు, విద్యాసంస్థలు, ఇతర భవనాలకు సైతం సెలవు ఉంటుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, వ్యాపార, పరిశ్రమ యాజమాన్యాలు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆయన సూచించారు.
మూడోవిడత ఎన్నికలు జరిగే పంచాయతీలు
మండలం జీపీలు ఏకగ్రీవం బరిలో ఉన్నవారు వార్డులు ఏకగ్రీవం బరిలో ఉన్నవారు
ఆసిఫాబాద్ 27 – 82 236 38 547
కాగజ్‌నగర్ 28 02 115 266 30 686
రెబ్బెన 24 – 89 214 26 509
తిర్యాణి 29 – 91 222 92 356
మొత్తం 108 02 377 938 186 2,098


