బడి గంట @ 9:40
చలి నేపథ్యంలో పాఠశాలల పనివేళల్లో మార్పు పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారుల నిర్ణయం ఉన్ని దుస్తులకు పెరిగిన గిరాకీ
కౌటాల(సిర్పూర్): జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. పలు మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్‌లోపే నమోదవుతున్నాయి. దీనికి తోడు ఉదయం, రాత్రి వేళల్లో చల్లగాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో పాఠశాలల పనివేళలు మార్చుతూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో జిల్లాలోని విద్యార్థులకు చలి నుంచి కాస్త ఉపశమనం కలగనుంది.
పనివేళలు ఇలా..
కొద్దిరోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గి గ్రామీణ ప్రజలు వణికిపోతున్నారు. రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు జిల్లాలోనే నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటలు దాటినా మంచుతెరలు వీడటం లేదు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పాఠశాలల పనివేళ్లల్లో మార్పులు చేస్తూ సోమవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఉదయం 9.00 నుంచి సాయంత్రం 4.15 వరకు ఉన్న పాఠశాలల సమాయాన్ని 40 నిమిషాలు పాటు పొడిగించారు. ఉదయం 9.40 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పాఠశాలలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ నెల 18 నుంచి మార్పు చేసిన పని వేళలు పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 690 ఉండగా, ప్రైవేట్ పాఠశాలలు 115 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 70,187 విద్యార్థులు చదువుకుంటున్నారు.
ఉన్ని దుస్తులు, వాటర్ హీటర్లకు డిమాండ్..
చలితీవ్రతకు జిల్లాలో ఉన్నిదుస్తులకు గిరాకీ పెరిగింది. వెచ్చదనం కోసం చద్దర్లు, స్వెటర్లు, మంకీ క్యాప్‌లు, హ్యాండ్ గ్లౌజులు, మఫ్లర్లు, సాక్సులు, కిడ్స్ స్వెట్టర్లు విత్ క్యాప్, షాత్ తదితర రకాల వస్త్రాలు కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, మహిళలకు సంబంధించిన వాటిని విస్తృతంగా అమ్ముతున్నారు. వినియోగదారుల అభిరుచికి తగిన రకాలను అందుబాటులో ఉంచారు. అలాగే ముఖం, చేతులు, ఇతర శరీర భాగాలు పొడిబారకుండా కోల్డ్‌క్రీమ్స్ వాడుతున్నారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాల్లోని మార్కెట్లలో రూ.300 నుంచి రూ.2000 ధరకు స్వెటర్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. తక్కువ ధర కోసం ఎక్కువ మంది వార సంతలపై ఆధారపడుతున్నారు. మరోవైపు శీతా కాలంలో చన్నీటి స్నానాలకు ప్రజలు ఇష్టపడటం లేదు. ఎముకల కొరికే చలిలో వాటర్ ట్యాంకుల్లోని నిల్వ నీటితో ముఖం కడుక్కోవాలన్నా, కాళ్లు తడుపుకోవాలన్నా జంకుతున్నారు. దీంతో వాటర్ హీటర్లుకు డిమాండ్ పెరిగింది. రూ.1500 నుంచి రూ.5 వేల వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. స్టోరేజీ వాటర్ హీటర్లు మాత్రం 6 నుంచి 25 లీటర్ల పరిమాణం వరకు ఉండగా.. దాదాపు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు లభ్యమవుతున్నాయి.
అప్రమత్తత ముఖ్యం
చలికాలం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చర్మవ్యాధులు సోకే అవకాశం ఉంది. ఇవి ప్రాణాంతకం కాకపోయినా చిరాకు, నొప్పులకు కారణమవుతా యి. అరికాళ్లు, పెదవులు పగలడం, చర్మం తెల్లగా పొడిబారినట్లుగా మారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చర్మం బిరుసుగా మారుతుంది. కోల్డ్‌క్రీమ్‌లు వినియోగించడంతోపాటు నూనె ద్వారా ఉపశమనం పొందవచ్చు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, రాత్రిపూట స్వెటర్లు ధరిస్తే చర్మానికి రక్షణగా ఉంటుంది. ఐదేళ్లలోపు చిన్నారులు జలుబు, జ్వరం బాడిన పడే ప్రమాదం ఉంటుంది. ఈదురుగాలులు, పొగమంచు నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు ఉదయం, రాత్రివేళల్లో బయట తిరగవద్దు, గర్బిణులు, బాలింతలు కూడా జాగ్రత్తగా ఉండాలి.
కొనసాగుతున్న చలి తీవ్రత
తిర్యాణి: జిల్లావ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. సోమవారం రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత సిర్పూర్(యూ)లో 7.6 డిగ్రీ ల సెల్సియస్‌గా నమోదైంది. అలాగే జిల్లాలో ని తిర్యాణి మండలం గిన్నెధరిలో 8.0 డిగ్రీ లు, తిర్యాణిలో 9.1, వాంకిడి, ఆసిఫాబాద్‌లో 10.6, కెరమెరిలో 10.8, పెంచికల్‌పేట్‌లో 10.9, దహెగాంలో 11.1, బెజ్జూర్‌లో 11.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


