ఓపీఎస్‌లకు కష్టకాలం! | - | Sakshi
Sakshi News home page

ఓపీఎస్‌లకు కష్టకాలం!

Dec 16 2025 11:50 AM | Updated on Dec 16 2025 11:50 AM

ఓపీఎస్‌లకు కష్టకాలం!

ఓపీఎస్‌లకు కష్టకాలం!

ఏప్రిల్‌ నుంచి వేతనాలు పెండింగ్‌ ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న కార్యదర్శులు తలకు మించిన భారంగా ఎన్నికల నిర్వహణ ఖర్చులు

రెబ్బెన(ఆసిఫాబాద్‌): గ్రామ పాలనను చక్కదిద్దడంతోపాటు గ్రామాల పరిశుభ్రత, ప్రజలకు తాగునీటి సరఫరా వంటి పనులు సాఫీగా సాగాలంటే పంచాయతీ కార్యదర్శి కీలకం. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. గ్రామపాలన సజావుగా సాగేలా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ పంచాయతీ కార్యదర్శులు కష్టకాలంలో ఉన్నారు. నెలలు గడుస్తున్నా చేతికి వేతనాలు అందకపోవడంతో ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఓ వైపు పంచాయతీ ఖజానాల్లో చిల్లిగవ్వ లేక, మరోవైపు నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో పడరాని పాట్లుపడుతున్నారు. చిన్న చిన్న సమస్యలను పరిష్కరించేందుకు వడ్డీలకు అప్పులు చేస్తూ నెట్టుకొస్తున్నారు. రె గ్యులర్‌ కార్యదర్శులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా.. వారి సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదు. రెగ్యులర్‌ ఉద్యోగులకు ప్రతినెలా 1న వేతనా లు అందిస్తుండగా, ఔట్‌సోర్సింగ్‌ కార్యదర్శులకు మాత్రం ఎనిమిది నెలలుగా పెండింగ్‌ ఉన్నాయి.

ఉత్తర్వుల జారీలో జాప్యం

రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో పాలన సాఫీగా సాగించేందుకు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను నియమించింది. కొన్నేళ్లుగా వారి సేవలను కొనసాగిస్తూ.. ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ ద్వారా వేతనాలు చెల్లిస్తోంది. ఈ పద్ధతిలో జిల్లాలో సుమారు 64 మంది ఓపీఎస్‌లు పనిచేస్తున్నారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సర్వీసు కొనసాగింపు ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేయడంలో జాప్యం జరిగింది. ఇది ఓపీఎస్‌ల పాలిటశాపంగా మారింది. వేతనాల చెల్లింపు బడ్డెట్‌ విడుదల అయినా సర్వీస్‌ కొనసాగింపు ఉత్తర్వులు రాని కారణంగా ట్రెజరీ అధికారులు వేతనాలు చెల్లించేందుకు నిరాకరించారు. నెలల తరబడి వేతనాల ఫైల్‌ ట్రెజరీలోనే ఉండిపోయింది. ఎట్టకేలకు ప్రభుత్వం సర్వీస్‌ కొనసాగింపు ఉత్తర్వులు విడుదల చేసినా.. ఓపీఎస్‌లకు ప్రస్తుతం వేతనాలు అందించలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కొన్నేళ్లుగా ఔట్‌సోర్సింగ్‌ విధానంలో వేలాది మంది బోగస్‌ ఉద్యోగుల పనిచేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వారిని ఏరివేసేందుకు చర్యలు చేపట్టింది. ఉద్యోగుల ఆధార్‌కార్డును ఐడీకి అనుసంధానం చేసింది. ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న కార్యదర్శులకు ప్రత్యేక ఎంప్లాయ్‌ ఐడీ లేకపోవడంతో ట్రెజరీలో వీరికి వేతనాలు చెల్లించడం సాధ్యం కావడం లేదు. వేతనాల చెల్లింపు కోసం అధికారులు సాఫ్ట్‌వేర్‌లో వివరాలను నమోదు చేసే క్రమంలో ఎంప్లాయ్‌ ఐడీ అడుగుతోంది. దీంతో అందుబాటులో బడ్జెట్‌ ఉన్నా వేతనాలు అందుకోని పరిస్థితిలో ఓపీఎస్‌లు ఉన్నారు.

ఎన్నికల వేళ పరేషాన్‌..

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇప్పటికే మొదటి, రెండో విడత ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగా.. మూడో విడత బుధవారం నిర్వహించనున్నారు. ఈ సమయంలో పంచాయతీ ఎ న్నికల నిర్వహణ ఏర్పాట్లు చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా కార్యదర్శులపైనే పడుతోంది. నిధులు లేకపోవడంతో సొంతంగా ఖర్చుచేస్తున్నారు. అయితే రెగ్యులర్‌ కార్యదర్శులకు ప్రభుత్వం ప్రతినెలా వేతనాలు చెల్లిస్తుండటంతో వారికి కాస్త ఊరట లభిస్తోంది. జీతంలో నుంచి ఎన్నికల నిర్వహణ ఖర్చులను భరిస్తున్నారు. కానీ ఓపీఎస్‌ల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. నెలల తరబడి వేతనాలు అందక కుటుంబ పోషణే భారంగా మారుతున్న తరుణంగా ఎన్నికల నిర్వహణ ఖర్చులు తలకు మించిన భారంగా మారాయి. ఎన్నికల సిబ్బంది, పోలీస్‌, పంచాయతీ సిబ్బందికి భోజనాలు, టీ ఖర్చులతోపాటు ఎన్నికలు జరిగే రోజున పోలింగ్‌ కేంద్రాల వద్ద టెంట్లు, తాగునీటి సౌకర్యం, సిబ్బంది భోజనాలు, ఇతర వసతుల కోసం ఒక్కో పంచాయతీలో కనీసంగా రూ.20వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఓపీఎస్‌లు అప్పులు చేసి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement