అత్యధిక స్థానాలు బీఆర్‌ఎస్‌వే..
కౌటాల మండలం ముత్తంపేట్ గ్రామంలో ఉద్రిక్తత
చింతలమానెపల్లి(సిర్పూర్): రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు అన్ని పార్టీలకు మిశ్రమ ఫలితాలు ఇచ్చాయి. ఆరు మండలాల్లో అత్యధిక స్థానాల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు సత్తా చాటగా, కాంగ్రెస్, బీజేపీకి చెందిన వారు చెప్పుకోదగ్గ స్థానాల్లో విజయం సాధించారు. ఎవరూ ఊహించని విధంగా స్వతంత్రులు సైతం విజయ బావుట ఎగురవేశారు. ఏ పార్టీల నుంచి మద్దతు లేకున్నా స్థానికంగా వారికి ఉన్న పలుకుబడితో ఓటర్లు పట్టం కట్టారు. చింతలమానెపల్లి మండలంలో ఏకంగా ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందడం గమనార్హం. ఈ మండలంలో కాంగ్రెస్‌కు ఐదు స్థానాలు, బీఆర్‌ఎస్‌కు ఆరు, బీజేపీ ఒకస్థానం దక్కించుకోగా.. ప్రధాన పార్టీల కన్నా ఎక్కువ స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. ఆయా మండలాల్లో 20కి పైగా స్థానాల్లో సత్తా చాటారు. మరోవైపు గెలుపొందిన స్వతంత్ర సర్పంచులను పార్టీల్లోకి చేర్చుకునే ప్రయత్నాలను ప్రధాన పార్టీలు మొదలుపెట్టాయి.
దూసుకెళ్లిన కారు
రెండో విడత ఎన్నికల్లో చింతలమానెపల్లి, కౌటాల, దహెగాం, బెజ్జూర్, పెంచికల్‌పేట్, సిర్పూర్(టి) మండలాల్లో మొత్తం 113 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థుల్లో 25 మంది విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌లో రెండు వర్గాలు పోటీ చేశాయి. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సైతం విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో పార్టీ మద్దతుదారులు ఏకంగా 43 స్థానాల్లో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థుల తరుఫున ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు రంగంలోకి దిగి పల్లెల్లో ప్రచారం చేశారు. ఆ పార్టీ నుంచి 24 మంది గెలిచారు. బెజ్జూర్, కౌటాల మండలాల్లో ఎక్కువగా బీఆర్‌ఎస్ హవా కనిపించింది. కౌటాల మండలం వీరవెల్లిలో లక్కీడ్రా నిర్వహించగా కావేరి విజయం సాధించారు. పంచాయతీలోని ఎనిమిది వార్డుల్లో 532మంది ఓటర్లు ఉన్నారు. 485 ఓట్లు పోలవగా, బీఆర్‌ఎస్ బలపర్చిన రజినికాంత్‌కు 204 ఓట్లు, కాంగ్రెస్ మద్దతుదారు జాడి కావేరికి 204 ఓట్లు వచ్చాయి. రిటర్నింగ్ అధికారి లక్కీడ్రా ద్వారా ఎన్నిక నిర్వహించగా, కావేరిని అదృష్టం వరించింది. కాగా, దహెగాం మండలం బీబ్రా పంచాయతీ, సిర్పూర్(టి), కౌటాల పంచాయతీల్లో అర్ధరాత్రి వరకు ఓట్ల లెక్కింపు కొనసాగింది.
రీకౌంటింగ్ చేపట్టాలని ఆందోళన
కౌటాల(సిర్పూర్): పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కౌటాల మండలం ముత్తంపేటలో ఆదివారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ అనంతరం రాంటెంకి ఉష 22 ఓట్లతో తన సమీప అభ్యర్థి డోంగ్రి సరోజపై విజయం సాధించారు. అభ్యంతరం తెలిపిన డోంగ్రి సరోజ వర్గీయులు రీకౌంటింగ్ చేపట్టాలంటూ ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. అప్పటికే సిబ్బంది ప్రక్రియ ముగించుకుని వెళ్తుండగా.. వారి వాహనాన్ని అడ్డుకున్నారు. ఆందోళన విషయం తెలుసుకున్న స్థానిక సీఐ సంతోష్‌కుమార్ ఘటన స్థలానికి చేరుకు న్నారు. వెంటనే ఆందోళనకారులను చెదరగొట్టారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలో విజేతలకు అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందించారు.
గెలిచిన సర్పంచుల వివరాలు
మండలం జీపీలు కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ స్వతంత్రులు
బెజ్జూర్ 22 1 15 2 4
చింతలమానెపల్లి 19 5 6 1 7
దహెగాం 23 7 4 8 4
కౌటాల 20 5 11 0 4
పెంచికల్‌పేట్ 12 3 4 5 0
సిర్పూర్(టి) 16 4 3 5 4
అత్యధిక స్థానాలు బీఆర్‌ఎస్‌వే..


